విగ్రహం సరే బయోపిక్ ఎప్పుడు?

Sun Jan 20 2019 17:26:33 GMT+0530 (IST)

దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు స్వర్గస్థులయ్యాక పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ 24 శాఖల కార్మికుల్లో ఆయన లేని బెంగ అలానే ఉంది. ఏ కష్టం నష్టం కలిగినా ఆయన తర్వాత చెప్పుకునేందుకు పెద్దలెవరూ కనిపించడం లేదన్న ఆవేదన కనిపిస్తోంది. చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించే పెద్దలెవరూ లేని ఆగమ్య గోచరం కనిపిస్తోందని పలువురు కార్మికులు వాపోవడం ఇప్పటికే చర్చకొచ్చింది.పెద్దరికాన్ని ఎవరు నెత్తికెత్తుకుంటారు? అన్నది అటుంచితే.. ప్రస్తుతానికి దర్శకరత్న డా.దాసరి నారాయణరావు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. శతాధిక చిత్ర దర్శకులు దాసరి విగ్రహావిష్కరణ మహోత్సవం ఈనెల 26న పాలకొల్లులో జరగనుంది. ఈ ఆవిష్కరణలో చలనచిత్ర రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలుస్తోంది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో దాసరి నారాయణరావు ప్రియ శిష్యులు పాల్గొంటారు. ఇకపోతే ఇదివరకూ దాసరి విగ్రహాన్ని ఫిలింనగర్ లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

విగ్రహావిష్కరణ సంగతి సరే.. దాసరి మరణానంతరం ఆయనపై బయోపిక్ లు తీస్తామని ఆయన శిష్యులు ప్రకటించారు. కానీ ఇంతవరకూ దానికి అతీ గతీ లేదు. సి.కళ్యాణ్ మంచు మోహన్ బాబు వంటి ప్రముఖులు తలుచుకుంటే అదేమంత పెద్ద కష్టమేమీ కాదు. అయినా ఎందుకనో గురువుగారిని లైట్ తీస్కున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోయినోళ్లు దేవుళ్లు.. ఉన్నోళ్లు మహానుభావులు!! అని సాంగేసుకోవడమేనా? ప‌్రాక్టికల్ గానూ భక్తి కీర్తనల బదులుగా ఇలా భక్తిని ప్రదర్శించొచ్చు కదా.. అని విమర్శిస్తున్న వాళ్లు ఉన్నారు.