ట్రైలర్ టాక్: కాపీ కొట్టేసే ‘దర్శకుడు’

Sun Jul 16 2017 10:02:08 GMT+0530 (IST)

సుకుమార్ నిర్మాణంలో వచ్చిన తొలి సినిమా ‘కుమారి 21 ఎఫ్’ అడుగడుగునా ఆయన ముద్రతో ఆకట్టుకుంది. ఇప్పుడు ‘సుకుమార్ రైటింగ్స్’ బేనర్లో తెరకెక్కిన రెండో సినిమా ‘దర్శకుడు’ కూడా సుక్కు స్టయిల్లోనే ఎంటర్టైన్ చేసేలా కనిపిస్తోంది. ఆ మధ్య ఒక వెరైటీ టీజర్ తో ఆకట్టుకున్న ‘దర్శకుడు’.. ఇప్పుడు ట్రైలర్ తో వచ్చేశాడు. ఈ ట్రైలర్ ముచ్చట్లేంటో చూద్దాం పదండి.

అందరూ సినిమాను థియేటర్ లోపల కూర్చుని చూస్తే.. పిల్లాడిగా ఉన్న మన ‘దర్శకుడు’ మాత్రం ప్రొజెక్టర్ రూంలోంచి చూస్తాడు. అదేంట్రా అంటే.. డైరెక్టర్లు ఇలగే చూస్తార్లే అంటాడు. అంటే దర్శకుడు కావడానికి బీజం చిన్నపుడే పడిపోతుందన్నమాట. మరి అతను దర్శకుడు ఎలా అయ్యాడన్నదే ఈ కథన్నమాట. తాను తీస్తున్న సినిమా సెట్లోకి వచ్చిన అమ్మాయిని ‘దర్శకుడు’ అనుకోకుండా ముద్దు పెట్టేసుకోవడం టీజర్లో చూశాం కదా. ట్రైలర్లో ఆ అమ్మాయితో మరింత క్లోజ్ కనిపించాడు ఈ ‘దర్శకుడు’. ఇతగాడికి తన జీవితంలో జరిగే ప్రతి అనుభవాన్ని సినిమాకు వాడేస్తుంటాుడ. ఎక్కడ ఏం చూసినా కాపీ కొట్టేస్తాడు. దాన్ని తన సినిమాలో పెట్టేస్తాడు. దీంతో అతడికి ‘కాపీ క్యాట్’ అని బిరుదిచ్చేస్తుంది హీరోయిన్.

మరోవైపు స్వయంగా హీరోనే ‘‘దర్శకుడికి  20 శాతం క్రియేటివిటీ ఉంటే.. 80 శాతం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి’’ అని సెలవిస్తాడు. మరి ఇలాంటి నేపథ్యంలో మన హీరో దర్శకుడిగా ఎలా రుజువు చేసుకున్నాడన్నది తెరమీదే చూడాలి. చాలా వరకు సరదాగా సాగేలా కనిపిస్తున్న ‘దర్శకుడు’.. చివరికి వచ్చేసరికి ఎమోషనల్ గా ముగిసేట్లు కనిపిస్తోంది. ట్రైలర్ తో హరి ప్రసాద్ సినిమాపై బాగానే ఆసక్తి పుట్టించగలిగాడు. ఈ సినిమా స్క్రిప్టులో సుక్కు ప్రమేయం ఏమీ లేనప్పటికీ.. ట్రైలర్ చూస్తే మాత్రం సుక్కు మార్కు చమత్కారం కనిపిస్తోంది. మరి సినిమాగా ఇదెలా మెప్పిస్తుందో చూడాలి.