Begin typing your search above and press return to search.

బాహుబలిని కొట్టేసినా కొట్టేయొచ్చు

By:  Tupaki Desk   |   24 May 2017 9:41 AM GMT
బాహుబలిని కొట్టేసినా కొట్టేయొచ్చు
X
బాహుబలి రిలీజ్ సమయంలో రూ. 1000 కోట్ల కలెక్షన్ల మైలురాయిని చేరుకోవడమే అద్భుతమే అనుకున్నారు. అలాంటిది రూ. 1500 కోట్ల పైగా వసూళ్లు సాధించి సరికొిత్త రికార్డు సృష్టించింది. ఈ రికార్డు ఇప్పట్లో బ్రేక్ చేయడం అసాధ్యమనే కాదని సినీ వర్గాలు భావించాయి. కానీ అతి త్వరలోనే మరో సినిమా ఈ రికార్డును బద్దలుకొట్టింది. అమీర్ ఖాన్ మల్ల యోధుడిగా నటించిన దంగల్ సినిమా ఈ ఫీట్ సాధించింది. ఈ సినిమా భారతదేశంలో చెప్పుకోదగిన వసూళ్లు సాధించినా బాహుబలి వాటన్నింటినీ దాటుకెళ్లిపోయింది. కానీ దంగల్ చైనీస్ భాషలోకి అనువదించి విడుదల చేసిన దగ్గర నుంచి కలెక్షన్లలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.

బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు రూ. 1577 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. దంగల్ ప్రపంచవ్యాప్త వసూళ్లు చూసుకుంటే రూ. 1546 కోట్లు ఉన్నాయి. ఈ ప్రకారం ఈ రెండు సినిమాల మొత్తం కలెక్షన్లలో తేడా రూ. 31 కోట్లు మాత్రమే. చైనా బాక్సాఫీస్ వద్ద దంగల్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక్కడ రిలీజ్ అయిన తర్వాతే దంగల్ రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పుడు రూ. 1500 కోట్ల క్లబ్ లోనూ చోటు దక్కించుకుంది. ఇదంతా కొద్ది వారాల్లోనే సాధ్యమైంది. ఆడపిల్లల పట్ల వివక్ష... పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు పడే తపన చైనీస్ ఆడియన్స్ కు విపరీతంగా కనెక్టయింది. ఒక్క చైనాలోనే ఈ సినిమా రూ. 775.93 కోట్లు వసూలు చేసిందంటే అక్కడి ఎంతటి ట్రెమండస్ హిట్ సాధించిందో అర్ధం చేసుకోవచ్చు.

వరల్డ్ హయ్యస్ట్ గ్రాసర్ గా ఇప్పటివరకు బాహుబలి రికార్డు భద్రంగానే ఉంది. కానీ దంగల్ కలెక్షన్లలో ఇదే స్పీడును కొనసాగిస్తే బాహుబలిని కొట్టేసినా కొట్టేయొచ్చు. ఎందుకంటే రెండింటి మధ్య తేడా చాలా తక్కువగానే ఉంది. ఏమైనా ఒకేసారి రెండు భారతీయ సినిమాలు రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇదీ ఓ రికార్డే కదా!