Begin typing your search above and press return to search.

దంగ‌ల్ గ‌ర్ల్‌ నూ ఏడ్పించేశారే!

By:  Tupaki Desk   |   10 Dec 2017 6:23 AM GMT
దంగ‌ల్ గ‌ర్ల్‌ నూ ఏడ్పించేశారే!
X
దేశంలో మృగాళ్ల దుశ్య‌ర్య‌ల‌కు ఎంత‌కూ తెర ప‌డ‌టం లేదు. మ‌హిళ‌లైనా - యువ‌తులైనా - చివ‌ర‌కు చిన్న పిల్ల‌లైనా కూడా ఈ వేధింపుల బారిన ప‌డ‌కుండా ఉండ‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌న్న ప‌చ్చి నిజం జీర్ణించుకోలేనిదే. ఈ దుశ్చ‌ర్య‌ల‌కు బ‌హిరంగ ప్ర‌దేశ‌మైనా - నిర్జ‌న ప్ర‌దేశ‌మైనా... చివ‌ర‌కు కిక్కిరిసి ఉన్న జ‌న‌స‌మ్మ‌ర్ధ ప్ర‌దేశ‌మైనా కూడా త‌మ‌కు మాత్రం ఏ తేడా లేద‌ని మృగాళ్లు నిరూపిస్తున్నారు. నిత్యం చోటుచేసుకుంటున్న ఈ త‌ర‌హా దుర్ఘ‌ట‌న‌ల‌తో మ‌హిళా లోకం బెంబేలెత్తిపోతోంది. ఎన్ని చ‌ట్టాలు చేసినా కూడా మృగాళ్ల దుశ్చేష్ట‌ల‌కు అడ్డుక‌ట్ట ప‌డటం లేదు. తాజాగా బాలీవుడ్ గ‌ర్ల్‌ - మిస్ట‌ర్ ఫ‌ర్‌ ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్ చిత్రంలో మ‌గ పిల్ల‌ల‌ను ఒంటి చేత్తో మ‌ట్టి క‌రిపించిన సెల‌బ్రిటీ అమ్మాయి జైరా వాసీంకు కూడా ఈ త‌ర‌హా వేధింపులు ఎదుర‌య్యాయి. ఓ మృగాడు పాల్ప‌డ్డ దుశ్చ‌ర్య కార‌ణంగా వాసీం వెక్కి వెక్కి ఏడ్చిన ఘ‌ట‌న ఇప్పుడు వైర‌ల్‌ గా మారింద‌నే చెప్పాలి.

నిండా ప్ర‌యాణికులు - అది కూడా సంపన్నులు ప్ర‌యాణం చేసే విమానంలో త‌న‌కు ఎదురైన ఈ త‌ర‌హా వేధింపులను వాసీం తానే స్వ‌యంగా వెల్ల‌డించిన వైనం నిజంగానే షాకింగ్ ఉదంతంగానే చెప్పుకోవాలి. ఈ వేధింపుల‌పై ఏమాత్రం సంకోచం లేకుండా వాసీం చెప్పిన తీరు - ఆ వేధింపుల‌ను వివ‌రిస్తూ ఆమె సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసిన వీడియో ఇప్పుడు వైర‌ల్‌ గా మారింది. ఇక వాసీంకు ఏ త‌ర‌హా వేధింపులు ఎద‌రయ్యాయ‌న్న విష‌యానికి వ‌స్తే... దేశ రాజ‌ధాని ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లేందుకు ఎయిర్ విస్తారా విమానం ఎక్కిన వాసీంపై ఓ వ్య‌క్తి చేతులు వేశాడ‌ట‌. వాసీం కూర్చున్న సీటుకు వెనుకే కూర్చున్న స‌ద‌రు వ్య‌క్తి జైరా భుజం - మెడ‌పై చేతులు వేశాడ‌ట‌. న‌డి వ‌య‌సు క‌లిగిన ఆ వ్య‌క్తి అంత‌టితో ఆగ‌కుండా... ఏకంగా సీటు కింద కాళ్లు పెట్టి ఆమెను మ‌రింత అస‌భ్య‌క‌రంగా ట‌చ్ చేశాడ‌ట‌. ఇదేదో రెప్ప‌పాటుగానో - లేదంటే కొన్ని క్ష‌ణాల పాటో జ‌రగ‌లేద‌ట‌. ఏకంగా ఓ ప‌ది నిమిషాల పాటు జైరా వాసీంను అస‌భ్య‌క‌ర రీతిలో త‌డుతూ రాక్ష‌సానందం పొందిన ఆ వ్య‌క్తి... ఆ త‌ర్వాత త‌న‌కేమీ తెలియ‌న‌ట్టే - తానేమీ చేయ‌న‌ట్టే వ్య‌వ‌హ‌రించాడ‌ట‌. నిద్ర మ‌త్తులో ఉన్న జైరా... దీనిని గ్ర‌హించేలోగానే అత‌డు త‌న కాలితో వాసీం మెడ‌పై త‌డిమాడ‌ట‌.

దంగ‌ల్ సినిమాలో ధైర్య‌వంతురాలైన బాలిక‌గా క‌నిపించిన జైరా... స‌ద‌రు వ్య‌క్తి చేస్తున్న అస‌భ్య చేష్ట‌ల‌ను కూడా కాస్తంత ధైర్యంగానే ప్ర‌శ్నించింద‌ట‌. అయితే త‌న దుశ్చేష్ట‌ల‌ను క‌ప్పిపుచ్చుకునే క్ర‌మంలో ఆ వ్య‌క్తి... విమానం కుదుపుల కార‌ణంగానే తాను అలా తాకాన‌ని - త‌న త‌ప్పేమీ లేద‌న్న‌ట్లుగానూ వ్య‌వ‌హ‌రించాడ‌ట‌. అయితే అత‌డి ఉద్దేశ్యాన్ని ప‌సిగ‌ట్టిన జైరా... మొత్తం విష‌యాన్ని విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింద‌ట‌. అయితే ఆమెను మ‌రింత ఆశ్చ‌ర్యానికి గురి చేస్తూ... సిబ్బంది కూడా ఆమె వాద‌న‌ను క‌నీసం చెవిన వేసుకున్న పాపాన కూడా పోలేద‌ట‌. దీంతో తీవ్ర మాన‌సిక వేద‌న‌కు గురైన వాసీం అక్క‌డే వెక్కి వెక్కి ఏడ్చింద‌ట‌. ఈ మొత్తం ఎపిసోడ్‌ ను వివ‌రిస్తూ ఓ వీడియోలో రికార్డు చేసిన త‌న వేద‌న‌నున ఇన్‌ స్టాగ్రామ్ వేదిక‌గా పోస్ట్ చేసింది. అస‌లు ఈ దేశంలో మృగాళ్ల నుంచి మ‌హిళ‌ల‌ను ర‌క్షించేవారే లేరా? అంటూ ప్ర‌శ్నిస్తూ విడుద‌ల చేసిన వీడియో ఇప్పుడు నిజంగానే వైర‌ల్‌ గా మారింది. విష‌యం తెలుసుకున్న మ‌హిళా క‌మిష‌న్ కూడా ఈ ఘ‌ట‌న‌పై ఆగ్ర‌హం వ్యక్తం చేస్తూ... స‌ద‌రు ప్ర‌యాణికుడికి సంబందించిన వివరాలు అంద‌జేయాల్సిందేన‌ని విస్తారా ఎయిర్ లైన్స్‌ను డిమాండ్ చేసింది.