Begin typing your search above and press return to search.

రిజర్వేషన్లపై సినిమా.. రచ్చరచ్చ

By:  Tupaki Desk   |   21 Feb 2017 11:11 AM GMT
రిజర్వేషన్లపై సినిమా.. రచ్చరచ్చ
X
ఒక సినిమా కారణంగా సెన్సారు బోర్డు కార్యాలయం పలుమార్లు దాడులకు టార్గెట్ అవుతోంది. ఇప్పటికే ఒకట్రెండు సార్లు దాడులకు గురైన హైదరాబాద్ లోని జాతీయ సెన్సార్ బోర్డు కార్యాలయాన్ని తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ విధ్యార్థులు మరోసారి ధ్వంసం చేశారు.

రిజ‌ర్వేష‌న్లు క‌థాంశంగా తెర‌కెక్కించిన సినిమా శ‌ర‌ణం గచ్ఛామి. ఇది విడుద‌లకు ముందే వివాదాల‌కు కేంద్రంగా మారింది. కొంద‌రు కావాల‌ని శ‌ర‌ణం గ‌చ్చామి విడుద‌ల‌కు అడ్డంకులు సృష్టిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. శ‌ర‌ణం గ‌చ్చామి మూవీలో రాజ్యాంగానికి వ్య‌తిరేకంగా ఎలాంటి అంశాలు లేవంటున్నారు ద‌ర్శ‌క నిర్మాతలు. రిజ‌ర్వేష‌న్లు ఎందుకు? వాటి ఆవ‌శ్య‌క‌త ఏంటి? అనే అంశాల‌పై స‌క‌ల జ‌నుల్లో సాగుతున్న చ‌ర్చ‌కు దృశ్య‌రూప‌మే త‌మ చిత్రం అంటున్నారు. శ‌ర‌ణం గ‌చ్చామి విడుద‌ల‌కు ప్ర‌తిబంధ‌కాల‌పై విద్యార్థి - ప్ర‌జా సంఘాలు భ‌గ్గుమ‌న్నాయి.

తాజాగా ఓయూ - ద‌ళిత‌ - బ‌హుజ‌న విద్యార్థి సంఘాల ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌ లోని సెన్సార్ బోర్డు ద‌గ్గ‌ర ఆందోళ‌న నిర్వ‌హించారు. శ‌ర‌ణం గ‌చ్చామి విడుద‌ల‌కు అనుమ‌తినివ్వాలంటూ నినాదాలు చేశారు. స్పంద‌న‌ క‌న్పించ‌క‌పోవ‌డంతో ఆగ్ర‌హించిన విద్యార్థి సంఘాల ప్ర‌తినిధులు సెన్సార్ బోర్డు ఆఫీసును ధ్వంసం చేశారు. వెంటనే పోలీసులు.. ఆందోళ‌న‌కారుల‌ను అదుపులోకి తీసుకున్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఈ సినిమాను రూపొందించారంటూ ఈ సినిమాకు ప్రాంతీయ సెన్సార్ బోర్డు నుంచి ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో విడుదలకు సెన్సార్ బోర్డు అంగీకరించలేదు. దర్శక - నిర్మాతలు మాత్రం పీడిత కులాల సమస్యలు - అగ్రవర్ణాల ఆధిపత్య ధోరణిని కథాంశంగా ఎన్నుకొని తీసిన సినిమా అంటున్నారు. ఎన్నిసార్లు వేడుకున్న సెన్సార్ బోర్డు సభ్యులు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఈ నెల మొదటివారంలోనూ చిత్ర యూనిట్ సభ్యులు - వివిధ సంఘాల నాయకులు కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు కార్యాలయంపై దాడి చేశారు. తాజాగా ఓయూ విద్యార్థులు కొందరు సినిమా విడుదల కోరుతూ ధర్నా చేయడంతో పాటు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కాగా, ఈ చిత్రం విడుదలైతే సమాజంలో శాంతి, భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందనే అందుకనే సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు సభ్యులు నిరాకరిస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు పలు సన్నివేశాలను తొలగించాలని సీబీఎఫ్‌ సీ సూచించగా అందుకు దర్శకుడు ప్రేమ్ రాజ్ నిరాకరించారని అందుకే ఈ చిత్రానికి సెన్సార్ నుంచి అనుమతి రావడం లేదని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/