నారా సరే మరి దగ్గుబాటి?

Thu Aug 09 2018 22:00:21 GMT+0530 (IST)

ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన అప్ డేట్స్ ఆసక్తికరంగానే కాదు కొన్ని ఆశ్చర్యానికి గురి చేసేలా ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు పాత్రకు ఇటీవలే రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు పాత్ర ఎవరు చేస్తారు అనే దాని గురించి మాత్రం ఎటువంటి సమాచారం లేదు. దగ్గుబాటి ఈ మధ్య క్రియాశీలక రాజకీయాల్లో ఎక్కువ యాక్టివ్ గా లేరు కానీ ఒకప్పుడు ఆయనకు ఫైర్ బ్రాండ్ అని పేరు. ఎన్టీఆర్ రాజకీయ జీవితం గురించి ఆయన రాసిన పుస్తకం సంచలనం అయ్యింది. దాని ద్వారానే బయటికి రాని  కొత్త విషయాలు ప్రపంచానికి తెలిసాయి.చంద్రబాబు ధోరణికి ఆయన వ్యతిరేకి. అలాంటప్పుడు బాబు వియ్యంకుడు బాలయ్య తీసే బయోపిక్ లో దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు పాత్ర ఉంటుందా అనే అనుమానం రావడం సహజం. విశ్వసనీయ సమాచారం మేరకు అది ఒకటి లేదా రెండు సీన్లకు మాత్రమే పరిమితమయ్యేలా ఇందులో ఉంటుందట. మరి నటుడు ఎవరు అనే నిర్ధారణ ఇంకా జరగలేదని తెలిసింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే రానా ఇంటి పేరు వెంకటేశ్వర్ రావు ఇంటి పేరు ఒకటే. కానీ రానా ఆయన పాత్ర బదులు నారా పాత్ర చేస్తున్నాడు. ఇది కాకతాళీయమే అయినప్పటికీ విశేషంగానే చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ కానీ పాత్రలు కూడా చాలానే ఉన్నాయి.

మహానటి సక్సెస్ అయ్యాక ఎన్టీఆర్ బయోపిక్ మీద చాలా అంచనాలు ఉన్నాయి. సావిత్రి గారి సినిమాకే అంత ఆదరణ దక్కినప్పుడు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానించే ఎన్టీఆర్ బయోపిక్ అంటే ఆసక్తి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా. సినిమా నటులు దర్శకుల మీద బయోపిక్ లు రూపొందించే ట్రెండ్ ఊపందుకుంటోంది. దర్శకులు కళాతపస్వి విశ్వనాధ్ గారి కథ ఇటీవలే జనార్ధన మహర్షి దర్శకత్వంలో మొదలైన సంగతి తెలిసిందే. ఏదేమైనా రానా ఎంట్రీ ఇచ్చాక మిగిలిన పాత్రల్లో ఎవరెవరు ఉంటారా అనే ఆసక్తి రెట్టింపయ్యింది. చూడాలి ఇంకా ఎవరెవరు రాబోతున్నారో.