Begin typing your search above and press return to search.

జెమిని కూతురి వ్యాఖ్యలపై సావిత్రి కూతురేమందంటే..

By:  Tupaki Desk   |   21 May 2018 5:55 PM GMT
జెమిని కూతురి వ్యాఖ్యలపై సావిత్రి కూతురేమందంటే..
X
సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ విషయంలో జెమిని గణేశన్ కూతురు డాక్టర్ కమల అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తన తండ్రిని తక్కువ చేసి చూపించారని.. సావిత్రికి ఆయనే మద్యం అలవాటు చేసినట్లు కూడా ప్రొజెక్ట్ చేశారని.. ఇది అబద్ధమని ఆమె అంది. ఇంకా ‘మహానటి’ టీంపై ఆమె పలు విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో సావిత్రి కూతురైన విజయ చాముండేశ్వరి స్పందించింది. ఆమెను ఈ విషయంలో తాను తప్పుబట్టబోనంటూ ఆసక్తికర రీతిలో ఆమె స్పందించింది. ఇంకా ఆమె ఏమందంటే..

‘‘నేను నా దృక్కోణంలో.. ఇంకా చెప్పాలంటే మా అమ్మ కోణంలో ‘మహానటి’ సినిమా చూశా. నా సోదరి కమల మరో కోణంలో సినిమా చూసింది. ఆమె స్వతహాగా తమిళురాలు. ‘మహానటి’ని ఒక తెలుగు డబ్బింగ్ సినిమాలాగే చూసిందామె. మా అమ్మను నాన్న అమితంగా ప్రేమించిన మాట వాస్తవం. నాకు కమల అక్కకు మధ్య ఈ సినిమా వల్ల విభేదాలు రావాలని నేను కోరుకోవట్లేదు’’ అని చాముండేశ్వరి అంది.

తన తల్లి సావిత్రికి తండ్రే మద్యం అలవాటు చేశాడన్నది నిజం కాదని.. సినీ పరిశ్రమలో మద్యం తాగడం మామూలు విషయమని.. అలా తన తల్లికి కూడా అలవాటై ఉండొచ్చని.. ఐతే సినిమాలో తన తండ్రి తాగినపుడే తల్లి కూడా మద్యం ముట్టినట్లు చూపిస్తారని.. అలాగే ఆమె అలా తాగడం అదే తొలిసారని కూడా చెప్పలేదన్న విషయాన్ని చాముండేశ్వరి గుర్తు చేసింది. తన తండ్రి నుంచి తనకు దక్కిన అతి పెద్ద ఆస్తి తన పెద్దమ్మ కుటుంబమే అని.. తన అక్కలను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోలేనని.. సినిమాలో అలిమేలుగా చూపించిన తన పెద్దమ్మ (బాబ్జీమా) తమకెంతగానో అండగా నిలిచిందని.. తన తండ్రి కుటుంబం మీద తనకు అపారమైన గౌరవం ఉందని.. అది కూడా తన కుటుంబమే అని చాముండేశ్వరి చెప్పింది.