Begin typing your search above and press return to search.

‘డీజే’ టీం పేరు మార్చుకోవాల్సిందేమో

By:  Tupaki Desk   |   27 Jun 2017 7:06 AM GMT
‘డీజే’ టీం పేరు మార్చుకోవాల్సిందేమో
X
రివ్యూల కంటే రెవెన్యూ ముఖ్యం అంటూ ‘దువ్వాడ జగన్నాథం’ విడుదలైన తొలి రోజే సమీక్షకుల మీద దాడి మొదలుపెట్టాడు హరీష్ శంకర్. సోషల్ మీడియాలో సైతం రివ్యూయర్లే లక్ష్యంగా వ్యాఖ్యలు చేశాడు. అవన్నీ సరిపోలేదని తాజాగా ‘డీజే’ థ్యాంక్స్ మీట్ సందర్భంగా సుదీర్ఘంగా సాగిన తన ప్రసంగంలో క్రిటిక్స్ నే లక్ష్యంగా చేసుకున్నాడు హరీష్.

ప్రజాస్వామ్యంలో ఎవరి ఒపీనియన్ వాళ్లకుంటుంది అంటూనే మీ అభిప్రాయాల్ని జనాల మీద రుద్దుతారా అంటూ రెచ్చిపోయాడు హరీష్. మరోవైపు అల్లు అర్జున్ కూడా ఇదే తరహాలో మాట్లాడాడు. తమ సినిమాను మెచ్చిన వాళ్లు మంచోళ్లు.. దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడిన.. రాసిన వాళ్లంతా చెడ్డోళ్లు అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశాడు బన్నీ. తర్వాత రివ్యూయర్లపై నేరుగానే విమర్శలు గుప్పించాడు. ఇక ఎప్పుడూ కంటెంట్ గురించే మాట్లాడే దిల్ రాజు కూడా కలెక్షన్ల లెక్కల గురించి మాట్లాడి క్రిటిక్స్ కు చురకలంటించే ప్రయత్నం చేశాడు.

మొత్తానికి ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పడానికి కాకుండా సమీక్షకుల్ని.. ‘డీజే’ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లను తిట్టడానికే ఏర్పాటు చేసినట్లుగా అనిపించింది వీళ్ల మాటలు చూస్తే. అలాంటపుడు దీనికి ‘థ్యాంక్స్ మీట్’ అని కాకుండా ‘అటాక్ ఆన్ క్రిటిక్స్’ అని పెట్టాల్సిందేమో.

‘బాహుబలి-2’ తర్వాత భారీ సినిమా ఏదీ రాక ఆవురావురుమని ప్రేక్షకులున్న టైంలో.. పాత సినిమాలన్నీ థియేటర్ల నుంచి లేచిపోవడంతో వేరే ఆప్షనే లేనపుడు మంచి హైప్ మధ్య విడుదల కావడం కలిసొచ్చి ‘డీజే’కు ఫస్ట్ వీకెండ్లో కలెక్షన్లు బాగానే వచ్చి ఉండొచ్చేమో. అంతమాత్రాన తామేదో ఓ కళాఖండం తీస్తే దానికి సమీక్షకులు ఉద్దేశపూర్వకంగా నెగెటివ్ రివ్యూలు ఇచ్చేసినట్లు ఫీలవుతూ మాట్లాడటమే ఇక్కడ విడ్డూరం. డివైడ్ టాక్ లోనూ మంచి వసూళ్లు వచ్చాయని సంతోషించడం పోయి.. ఇలా రివ్యూయర్ల మీద అక్కసు వెళ్లగక్కడాన్ని ఏమనాలో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/