Begin typing your search above and press return to search.

క్రికెట్ ఆడితే పెళ్లి కాదన్నారట..

By:  Tupaki Desk   |   22 July 2018 10:43 AM GMT
క్రికెట్ ఆడితే పెళ్లి కాదన్నారట..
X
భారత పురుషుల క్రికెట్లో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ లాంటి వాళ్లు ఎంత కీలకమో.. మహిళల క్రికెట్లో మిథాలీ రాజ్ కూడా అంతే కీలకం. ఇంకా చెప్పాలంటే మిథాలీ పడ్డ కష్టం.. చేసిన త్యాగాల ముందు సచిన్ - గావస్కర్ లాంటి వాళ్లు నిలవలేరు. అసలు ఆదరణ.. ఆదాయం ఎంతమాత్రం లేని మహిళల క్రికెట్లో అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలుగా ఆటకే అంకితం అయిందామె. 35 ఏళ్ల వయసులోనూ ఆటపై ప్రేమను ఆపుకోలేక ఇంకా పోటీ క్రికెట్లో కొనసాగుతోందామె. సుదీర్ఘ కెరీర్లో ఆమె పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఇప్పుడైతే మహిళల క్రికెట్‌ కు కూడా గుర్తింపు లభిస్తోంది. ఆదాయమూ అందుతోంది. ఎంతోమంది అమ్మాయిలు క్రికెట్ వైపు వస్తున్నారు. కానీ ఒకప్పుడు అలా కాదు. అమ్మాయిలు క్రికెట్ ఆడటాన్ని అందరూ చాలా తప్పుగా చూసే రోజుల్లో ఆమె ఈ ఆటలోకి అడుగుపెట్టింది.

నాటి రోజుల గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది ఒక ఇంటర్వ్యూలో మిథాలీ. క్రికెట్‌ ఆడితే.. పెళ్లి కాదని ఆమెను కెరీర్ ఆరంభంలో చాలామంది భయపెట్టారట. తాను క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోవడం తన తండ్రి కోరిక అని వెల్లడించింది. మంచి డ్యాన్సర్‌ అవ్వాలనేది వాళ్లమ్మ కోరికట. ‘‘ముందు నేను డ్యాన్స్ సాధన చేశాను. కానీ కొన్ని కారణాల వల్ల క్రికెట్‌ నా కెరీర్‌ అయింది. క్రికెటర్‌ అవ్వాలని అనుకుంటున్నట్లు చెబితే తాతయ్య.. నానమ్మ నమ్మలేదు. ఎవరూ నిద్రలేవక ముందే లేచి ప్రాక్టీస్‌కు వెళ్లేదాన్ని. తిరిగి సాయంత్రం వచ్చేదాన్ని. ముఖమంతా జిడ్డుగా మారేది. అక్కడక్కడా పగుళ్లు వచ్చేవి. రెండు మూడు గాయాలు కూడా అయ్యాయి. అవి చూసి మా తాతయ్య-నానమ్మలు నన్ను ఏడిపించేవారు. క్రికెట్‌ ఆడటానికి వెళ్లి ఇలా తయారైతే.. నిన్ను పెళ్లి చేసుకోడానికి ఎవరూ ముందుకు రారు అని ఆటపట్టించేవారు’’ అని చెప్పింది మిథాలీ.