వేడి పెంచుతున్న టాప్ 5 మల్టీస్టారర్స్

Fri Mar 15 2019 07:00:01 GMT+0530 (IST)

2019-20 సీజన్ టాప్ 5 మల్టీస్టారర్స్ ఏవి? ఈ ప్రశ్నకు సమాధానం ఇదే. 2019 లో తెరకెక్కుతూ రిలీజ్ లకు తేదీల్ని ఫిక్స్ చేసుకున్న ఓ నాలుగు మల్టీస్టారర్ల వివరాలు పరిశీలిస్తే... వందేళ్ల భారతదేశ చరిత్రలో అసాధారణ బడ్జెట్లతో తెరకెక్కుతున్న క్రేజీ సినిమాలు ఇవేనని అర్థమవుతోంది.ఆ నాలుగు భారీ మల్టీస్టారర్లు ఏవి? అంటే.. ఆర్.ఆర్.ఆర్ - కళాంక్ - బ్రహ్మాస్త్ర - మరక్కర్ చిత్రాల గురించి క్రిటిక్స్ ప్రముఖంగా ప్రస్థావిస్తున్నారు. ఎస్.ఎస్.రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తేదీని ప్రకటించి అసలు సిసలైన వార్ కి తెరలేపారు. 2020 జూలై 30న ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని ప్రకటించగానే ఇతర మల్టీస్టారర్ల గురించి ఆసక్తికర చర్చ మొదలైంది. ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని దాదాపు 350 -400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నామని డివివి ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత డివివి దానయ్య ప్రకటించారు. అంటే ఇండియాలో ఇప్పటివరకూ 2.0 తర్వాత మళ్లీ అంత పెద్ద బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమాగా ఆర్.ఆర్.ఆర్ గురించే మాట్లాడుకుంటున్నారంతా. ఇండియా టాప్ బడ్జెట్ మల్టీస్టారర్ గా ఈ సినిమా పేరు మార్మోగిపోతోంది. చరణ్ - తారక్ - ఆలియా - అజయ్ దేవగన్ వంటి భారీ తారాగణంతో ఆర్.ఆర్.ఆర్ వేడెక్కిస్తోంది.

ఇక ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి ధీటుగా భారీ బడ్జెట్లతో రూపొందుతున్న చిత్రాలుగా సైరా నరసింహారెడ్డి - సాహో - కళాంక్ - బ్రహ్మాస్త్ర - మరక్కర్ (మలయాళం) చిత్రాల పేర్లు మార్మోగిపోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో ఆర్.ఆర్.ఆర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న `సైరా- నరసింహారెడ్డి` దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోందన్న సమాచారం ఉంది. హిస్టారికల్ నేపద్యం లో వీరుని కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు లేదా అక్టోబర్ లో రిలీజ్ కానుందని తెలుస్తోంది. అలాగే డార్లింగ్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న సాహో చిత్రం దాదాపు 225 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు - మేకింగ్ వీడియోలో అంతర్జాలంలో జెట్ స్పీడ్ తో దూసుకుపోయాయి. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ జాబితాలో సైరా - సాహో చిత్రాలు నిలిచాయి.

అమితాబ్ బచ్చన్ - రణబీర్ కపూర్ - ఆలియాభట్ - నాగార్జున వంటి భారీ తారాగణంతో ధర్మ ప్రొడక్షన్స్ - ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న బ్రహ్మాస్త్ర చిత్రానికి దాదాపు 150 కోట్ల బడ్జెట్ ని కేటాయించారు. కరణ్ జోహార్ నేతృత్వ ంలోని మరో భారీ ఫిక్షన్ చిత్రం బ్రహ్మాస్త్ర లోనూ ఆలియా కథానాయికగా నటిస్తోంది. బ్రహ్మాస్త్ర 2020 డిసెంబర్ 20న రిలీజవుతోంది. కరణ్ జోహార్ ఇన్వాల్వ్ మెంట్ తోనే .. ఆయనే నిర్మాతగా మరో భారీ మల్టీస్టారర్ `కళాంక్` తెరకెక్కుతోంది. సంజయ్ దత్ - మాధురి ధీక్షిత్ - సోనాక్షి సిన్హా - ఆలియాభట్ - వరుణ్ ధావన్ - ఆదిత్య రాయ్ కపూర్ తారాగణంగా అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో  ధర్మ ప్రొడక్షన్స్- ఫాక్స్ స్టార్ స్టూడియోస్- నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. దాదాపు 80- 100కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిత్రం ఏప్రిల్ 17న రిలీజవుతోంది. మోహన్ లాల్ - నాగార్జున- సునీల్ శెట్టి- అర్జున్ షార్జా- సిద్ధిఖి- ప్రభుదేవా- సుదీప్ వంటి భారీ స్టార్ల కాంబినేషన్ లో ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ `మరక్కర్` (మలయాళం) చిత్రానికి దాదాపు 100 కోట్ల బడ్జెట్ ని కేటాయించారని తెలుస్తోంది. ఆశీర్వాద్ సినిమాస్- మూన్ షాట్ ఎంటర్ టైన్ మెంట్స్- కాన్ఫిడెంట్ గ్రూప్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం 2020లో రిలీజ్ కానుంది. ఈ ఐదారు మల్టీస్టారర్ల రికార్డుల గురించి ట్రేడ్ సహా జనంలో ఆసక్తికర డిబేట్ రన్ అవ్వడం ఖాయం.