Begin typing your search above and press return to search.

గుణశేఖరా.. క్రేజ్ బానే ఉందయ్యా

By:  Tupaki Desk   |   7 Oct 2015 2:30 PM GMT
గుణశేఖరా.. క్రేజ్ బానే ఉందయ్యా
X
‘రుద్రమదేవి’ విషయంలో ఇదిగో అదిగో అంటూ ఊరించి ఊరించి ఎన్నోసార్లు ఉస్సూరుమనిపించాడు గుణశేఖర్. పైగా గత మూణ్నాలుగు నెలల్లో అయితే రిలీజ్ పక్కా అని చెప్పి రెండుసార్లు సినిమాను వాయిదా వేయించేసి నిరుత్సాహపరిచాడు. ఇలా చేసినందుకు ప్రేక్షకులకు గుణశేఖర్ పై కోపం ఉండాలి. అతడి సినిమాపై ఆసక్తి తగ్గిపోవాలి. కానీ ప్రేక్షకుల్లో అలాంటి ఫీలింగేమీ ఉన్నట్లు లేదు. సినిమా కోసం ప్రాణం పెట్టి కష్టపడిన గుణశేఖరుడిని జనాలు క్షమించేసినట్లే ఉన్నారు. సినిమా మీద ప్రేక్షకులు బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి శరవేగంగా జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్సే నిదర్శనం.

రెండు మూడు రోజుల కిందటే రుద్రమదేవి బుకింగ్స్ ఓపెనయ్యాయి. మొదట సింగిల్ స్క్రీన్ థియేటర్లు కొన్ని వదిలారు. బుకింగ్స్ మొదలవడం ఆలస్యం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఈ రోజు దాదాపుగా మల్టీప్లెక్సులతో కలిపి అన్ని థియేటర్ల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. దాదాపుగా అన్ని థియేటర్లలోనూ కొన్ని గంటల్లోనే టికెట్లు దాదాపుగా అయిపోవచ్చాయి. చాలా థియేటర్లు టికెట్లు ‘సోల్డ్ ఔట్’ అని చూపిస్తున్నాయి. కొన్ని ‘ఆల్మోస్ట్ ఫుల్’ అంటున్నాయి. మొత్తానికి ‘రుద్రమదేవి’ మీద జనాల ఆసక్తి బాగానే ఉంది. ఓ స్టార్ హీరో సినిమాకున్న స్థాయిలో రెస్పాన్స్ కనిపిస్తోంది. ఇది గుణశేఖర్ లో ఉత్సాహం నింపేదే. ఎందుకంటే రూ.70 కోట్ల బడ్జెట్లో సినిమా తీసిన గుణశేఖర్ ఓపెనింగ్స్ మీదే ఆశలు పెట్టుకున్నాడు మరి.