రంభను కూర్చొని సెటిల్ చేసుకోమన్నారు

Tue Mar 21 2017 11:09:28 GMT+0530 (IST)

సెలబ్రిటీల పెళ్లిళ్లు జరగటం.. అంతలోనే ఏదో ఒక వివాదం కమ్ముకోవటం ఈ మధ్యన తరచూ జరుగుతున్నదే. ఇదే తీరులో నాటి నటి రంభ పరిస్థితి ఉందన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు టాప్ టాలీవుడ్ హీరోలతో జత కట్టి.. అభిమానుల కలల దేవతగా మారిన రంభ.. 2010లో కెనడాకు చెందిన ఇంద్రకుమార్‌ను ప్రేమించి పెళ్లాడారు. అనంతరం భర్తతో కలిసి వెళ్లిన ఆమె.. కొంతకాలం బాగానే ఉన్నారు.

ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా టీవీ షోలలో పాల్గొని అన్యోన్య దంపతులుగా కనిపించిన వారు.. అంతలోనే విభేదాలతో విడిపోవటం అందరిని షాక్ కు గురి చేసింది. భర్తతో వచ్చిన విభేదాల నేపథ్యంలో ఇద్దరు పిల్లల్ని తీసుకొని చెన్నైకి తిరిగి వచ్చేసిన రంభ.. తనను తన భర్తతో కలపాలని కోరుతూ చెన్నై హైకోర్టు కుటుంబ సంక్షేమ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

పిల్లల సంరక్షణ కోసం నెలకు రూ.2.5లక్షలు చెల్లించేలా ఆదేశించాలని కోరారు. వీరి వివాదం సోమవారం కోర్టు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా రంభ.. తన ఇద్దరు పిల్లలతో కలిసి కోర్టుకు హాజరు కాగా.. భర్త ఇంద్రకుమార్ కూడా కోర్టుకు వచ్చారు. ఇరువురిది ఫ్యామిలీ మేటర్ కావటంతో.. వీరిని ప్రత్యేక గదిలో ఉంచిన కోర్టు..సామరస్యంగా చర్చల నడుమ పరిష్కరించుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇందుకోసం ఒక న్యాయవాదిని కోర్టు నియమించింది. వీరి చర్చల అనంతరం.. కోర్టు తన ఆదేశాల్ని వెలువరించనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/