Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ వివాదాలు..అంతా ప‌బ్లిసిటీ స్టంట్‌?

By:  Tupaki Desk   |   21 July 2019 5:40 AM GMT
బిగ్ బాస్ వివాదాలు..అంతా ప‌బ్లిసిటీ స్టంట్‌?
X
గ‌డిచిన కొద్ది రోజులుగా `బిగ్ బాస్ 3` వివాదాలు వేడెక్కించిన సంగ‌తి తెలిసిందే. స‌రిగ్గా షో ప్రారంభానికి ప‌దిహేను రోజుల ముందుగా ఊహించని విధంగా వ‌రుస వివాదాలు తెర‌పైకొచ్చాయి. అప్ప‌టివ‌ర‌కూ అస‌లు బిగ్ బాస్ కొత్త సీజ‌న్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో కూడా ఎవ‌రికీ అవ‌గాహ‌నే లేదు. ప‌బ్లిసిటీ అంత బ‌లంగానూ జ‌నాల్లోకి వెళ్ల‌లేదు. పైపెచ్చు రెండు సీజ‌న్లు పూర్త‌య్యాక ఇక ఈ రియాలిటీ షోపై జ‌నాల్లోనూ ఆస‌క్తి త‌గ్గిందా? స‌్టార్ మా కు కొత్త సీజ‌న్ ప్రారంభించే ఆలోచ‌న లేదా? అన్న సందేహాలు క‌లిగాయి. తొలి సీజ‌న్ తో పోలిస్తే రెండో సీజ‌న్ ఆశించినంత విజ‌యం సాధించ‌క‌పోవ‌డం కూడా సందేహానికి తావిచ్చింది.

ఇలా అయితే లాభం లేద‌నుకుని కావాల‌నే ఈ వివాదాల్ని స్టార్ మా నిర్వాహ‌కులు రాజేశారా? ముంబై టీవీ ఇండ‌స్ట్రీ ప‌బ్లిసిటీ క‌ల్చ‌ర్ ని హైద‌రాబాద్ టీవీకి ప‌రిచ‌యం చేయాల‌ని భావించారా? అందుకే ఈ వివాదాల్ని తెర‌వెన‌క ఉండి రాజేశారా? ఇలా ర‌క‌ర‌కాల సందేహాల్ని జ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదాల‌కు పోలీసుల్ని.. కోర్టుల్ని.. హ్యూమ‌న్ రైట్స్ ని.. దిల్లీ మ‌హిళా క‌మీష‌న్ ని.. ఇన్ని విభాగాల్ని రింగులోకి లాగ‌డం అంటే మాట‌లా? అస‌లు ఈ వివాదాల్ని ఏ కోణంలో అర్థం చేసుకోవాలి?

లైంగిక వేధింపులు అని డైరెక్టుగా అన‌కుండానే ఫ‌లానా విధంగా ప్ర‌శ్న‌ల‌తో వేధించార‌ని జ‌ర్న‌లిస్ట్ కం యాంక‌ర్ శ్వేతారెడ్డి బిగ్ బాస్ నిర్వాహ‌కుల‌పై ఆరోపించ‌డంతో అస‌లు క‌థ మొద‌లైంది. అటుపై త‌న‌తో పాటు న‌టి గాయ‌త్రి గుప్తా జ‌త క‌లిసి ఎపిసోడ్స్ అన్నిటినీ ర‌క్తి క‌ట్టించ‌డంతో బిగ్ బాస్ గురించి ప‌ల్లె ప‌ల్లెనా మూల మూల‌నా విప‌రీతంగా చ‌ర్చించుకున్నారు. వేధింపుల టాపిక్ ఎత్త‌గానే `తెలుగు- బిగ్ బాస్` గురించి గ‌ల్లీ నుంచి దిల్లీ వ‌ర‌కూ ప్ర‌చార‌మైంది. స‌రిగ్గా ఇదే హౌస్ నిర్వాహ‌కులకు కావాల్సింది! అన్న సందేహాన్ని ఇప్పుడు ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. ప్రీప‌బ్లిసిటీలో ఫ్రీ ప‌బ్లిసిటీ జిమ్మిక్కుని చాలా క్లెవ‌ర్ గా ప్లే చేశార‌న్న ముచ్చ‌ట ఫిలింన‌గ‌ర్ వార్గాల్లోనూ సాగుతోంది. ఇలా ముంద‌స్తు ప్ర‌చారాన్ని పీక్స్ కి చేర్చ‌డం ద్వారా తొలి ఎపిసోడ్ నుంచే ఈ రియాలిటీ షోని ప‌రుగులు పెట్టించే ప‌న్నాగం ప‌న్నార‌న్న అనుమానం ఓవైపు వ్య‌క్త‌మ‌వుతోంది. కొంద‌రు పార్టిసిపెంట్స్ ని ఒక ఇంట్లోకి పంపించ‌డం ద్వారా బిగ్ బాస్ టీవీ షో మొద‌లవుతుంది. ఇది టీవీలో చూసే ప్రేక్ష‌కుల కోసం అనుకుంటే షో ప్రారంభానికి ముందే ఫ్రీ-ప్రీప‌బ్లిసిటీ కోసం 5 కోట్ల జ‌నాభా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్ని ఓపెన్ టాప్ బిగ్ బాస్ హౌస్ గా భావించి జ‌నాల్ని ఆడుకున్నారా? అన్న సందేహం ఇప్పుడు వేడెక్కిస్తోంది. అస‌లు వివాదాల‌తో సంబంధం లేకుండా నేడు కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ 3 ప్రారంభ‌మ‌వుతోంది. ఈ ఆదివారం మొద‌లు అనునిత్యం జ‌నాల క‌ళ్ల‌ను టీవీల‌కు క‌ట్టేసేందుకు రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో వివాదాల మాటేమిటి? అంటూ యువ‌త‌రంలో ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇంత‌కీ ఇది ఫ్రీప‌బ్లిస‌టీనా? ప‌్రీప‌బ్లిసిటీ స్టంట్ నా?