Begin typing your search above and press return to search.

కొత్త కాన్సెప్ట్; ఏపీలో కంటైనర్ సినిమాహాళ్లు

By:  Tupaki Desk   |   12 Jun 2016 4:42 AM GMT
కొత్త కాన్సెప్ట్; ఏపీలో కంటైనర్ సినిమాహాళ్లు
X
ఇవాల్టి రోజుల్లో సినిమాహాలు నిర్మించాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మరి.. దానికి పరిష్కారం ఏమిటి? టికెట్ ధరలు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. వాటిని తగ్గించటం.. వినోదాన్ని మరింత పెంచటానికి ఏం చేయాలి? ఎలా చేయాలి? లాంటి ప్రశ్నలకు సమాధానమే.. కంటైనర్ సినిమాహాళ్లే. సిమెంట్ అన్న పదార్థం వాడకుండా నిర్మించే ఈ థియేటర్ ను ఎప్పుడు.. ఎక్కడికి కావాలన్న మూవ్ చేసే విదంగా నిర్మించటమే కాదు.. వాయువేగంతో నిర్మించే వీలు ఉంటుంది. ఏపీలోని విశాఖ నగరంలో నిర్మిస్తున్న ఈ కంటైనర్ థియేటర్లు రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.

ఇంతకీ కంటైనర్ థియేటర్లు అంటే ఏమిటి? వాటిని ఎలా నిర్మిస్తారు? దీని కాన్సెప్ట్ ఏమిటన్న విషయాల్లోకి వెళితే.. కోట్లాది రూపాయిలు ఖర్చు చేసి భారీగా థియేటర్ల స్థానే వచ్చిందే ఈ కంటైనర్ థియేటర్లు. తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేయటం.. అనుకున్న విధంగా బిజినెస్ జరగకపోతే.. భారీగా నష్టపోయే స్థానే బిచాణా (పాజిటివ్ గా చదువుకోండి సుమా) ఎత్తేసి.. కోరుకున్న చోటకు తరలించేందుకు వీలుగా దీన్ని నిర్మిస్తారు. దాదాపు 200 మంది కూర్చునేలా వీటిని రూపొందిస్తున్నారు.

ఈ తరహా సినిమాలు ప్రాశ్చాత్య దేశాల్లో మామూలే. కాకుంటే అక్కడ యాభై మంది కూర్చునేందుకు వీలుగా వీటిని నిర్మిస్తారు. అదే కాన్సెప్ట్ కి మనదైన శైలిలో మార్పులు చేయనున్నారు. తాజాగా విశాఖ ఎయిర్ పోర్ట్ కి దగ్గర్లోని షీలానగర్ లో ఈ కొత్త కాన్సెప్ట్ థియేటర్ ను సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి థియేటర్ల నిర్మాణంలో ఎక్కడా సిమెంటు అన్నది వాడరు. సిమెంటు గోడలకు బదులుగా డబుల్ ఇన్సులేషన్ తో ఉన్న ఐరన్ షీట్స్ వాడతారు. దీంతో.. షార్ట్ సర్క్యూట్స్ కు అవకాశం ఉండదు. ఫ్లోరింగ్ ను ఫ్లైవుడ్ తో చేస్తారు. వందలాది మంది కూర్చున్నప్పుడు ఇబ్బంది కాదా? అన్న సందేహాలకు సమాధానంగా.. ఫ్లైవుడ్ షీట్ల కింధ ఇనుపరాడ్లతో బేస్ తయారు చేసి నిర్మిస్తారు. దీంతో.. ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఇంతకీ ఈ థియేటర్ సైజు ఎంత ఉంటుంది? స్క్రీన్ సైజ్ ఎంతన్న సందేహాలకు సమాధానాల్ని వెతికే.. 20 అడుగుల ఎత్తుతో నిర్మించే ఈ థియేటర్లో 31×14 అడుగుల స్క్రీన్ ను ఏర్పాటు చేస్తారు.ఇక.. థియేటర్ పైకప్పు మీద 20 కిలోవాట్ల తొమ్మిది సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేశారు. దీంతో.. సినిమా హాల్ కు అవసరమైన విద్యుత్ అవసరాల్ని తీరుస్తుంది. మిగిలిన అవసరాల్ని తీర్చుకోవటం విద్యుత్ అధికారుల సాయం తీసుకోవాల్సి ఉంటుంది. సోలార్ ప్యానల్స్ లేకుండా అయితే రూ.25 లక్షలతో పూర్తి అయ్యే ఈ థియేటర్.. సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేయాలంటూ మాత్రం మరో రూ.11లక్షలు ఖర్చు అవుతుంది. ఇక.. ఏసీ వసతి కూడా కావాలంటే మరికాస్త ఎక్కువ ఖర్చు అవుతుంది. అనుకున్న బిజినెస్ నడవకపోతే ఈ థియేటర్ సెటప్ ను మరో చోటకు తరలించేయొచ్చు. టెంప్టింగ్ గా ఉన్న ఈ కాన్సెప్ట్ కు రానున్న రోజుల్లో ఎలాంటి ఆదరణ ఉంటుందో చూడాలి.