Begin typing your search above and press return to search.

థియేటర్లలో మంచినీటి దోపిడీకి చెక్

By:  Tupaki Desk   |   24 April 2017 5:55 AM GMT
థియేటర్లలో మంచినీటి దోపిడీకి చెక్
X
నూట యాభై రూపాయలు పెట్టి టికెట్ కొని మల్టీప్లెక్సులో సినిమా చూద్దామని వెళ్తాం. అక్కడ చూస్తే మంచి నీళ్లు అందుబాటులో ఉండవు. డబ్బులు పెట్టి కొందామంటే బయట 20 రూపాయలుండే వాటర్ బాటిల్‌ కు నలభయ్యో యాభయ్యో వసూలు చేస్తారు. పాక్ కార్న్ ఇమ్మంటే వంద కొట్టమంటాడు. మల్టీప్లెక్సుల్లో ఏది ముట్టుకున్నా ఇలాగే షాక్ కొడుతుంది. ఇదేంటి ఇంత రేటు అంటే ఇక్కడింతే అంటూ అదోలా చూస్తారు. ఐతే నిబంధనల ప్రకారం సింగిల్ స్క్రీన్ అయినా.. మల్టీప్లెక్స్ అయినా ప్రేక్షకుడికి శుభ్రమైన మంచి నీరు అందుబాటులో ఉంచాలి. కానీ థియేటర్ల యాజమాన్యాలు దీన్ని పట్టించుకోవు. నిబంధనల మీద అవగాహన లేని ప్రేక్షకులు కూడా దీని మీద నిలదీయరు.

ఐతే ఇటీవలే హైదరాబాద్ కన్జూమర్ ఫోరంలో ఓ వ్యక్తి దీనిపై కేసు వేసి పోరాడాడు. ఈ సందర్భంగా అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రతి థియేటర్లోనూ మంచి నీళ్లు కచ్చితంగా అందుబాటులో ఉంచాలి. అది ప్రేక్షకుడికి సౌకర్యంగా ఉండే ప్రదేశంలో ఏర్పాటు చేయాలి. అంతే కాదు.. బయట మార్కెట్లో ఎంత ధర ఉందో.. అంతే ధరకు వాటర్ బాటిళ్లు అమ్మకానికి పెట్టాలి. ఈ నిబంధనల్ని అతిక్రమిస్తే జరిమానాలు పడతాయి. ప్రేక్షకులు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ లోని ఓ మల్టీప్లెక్స్ లో ఈ నిబంధన పాటించనందుకు అధికారులు జరిమానా కూడా వేశారు. నిజానికి ప్రేక్షకులు తమ వెంట వాటర్ బాటిళ్లు కూడా తీసుకెళ్లేందుకు కూడా అనుమతి ఉన్నప్పటికీ చాలా థియేటర్లలో వీటిని అడ్డుకుంటూ ఉంటారు. కాబట్టి ఇకపై థియేటరుకు వెళ్లినపుడు ఈ నిబంధనల్ని దృష్టిలో పెట్టుకోండి. ఐతే కేవలం మంచి నీటి వరకే కాకుండా.. మిగతా తినుబండారాలు.. పానీయాల ధరల విషయంలోనూ ప్రభుత్వం నియంత్రణ తీసుకొస్తే బాగుంటుందన్నది ప్రేక్షకుల అభిప్రాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/