Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు గుబులు పుట్టిస్తున్న ఆ సినిమా

By:  Tupaki Desk   |   21 Jun 2017 9:03 AM GMT
కాంగ్రెస్ కు గుబులు పుట్టిస్తున్న ఆ సినిమా
X
హరిత విప్లవంతో.. బ్యాంకుల జాతీయీకరణతో దేశ అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన నేత ఇందిరా గాంధీ. ఆమెను దేశ చరిత్రలో గొప్ప ప్రధానిగా చెప్పుకోవాల్సిందే. కానీ ఆమెను మనస్ఫూర్తిగా అభినందించడానికి.. మచ్చ లేని నేతగా అభివర్ణించడానికి ఎవరికీ మనసు రాదు. అందుక్కారణం 1975లో ఎమర్జన్సీ విధించి దేశాన్ని చీకట్లోకి నెట్టడమే. తన పదవిని కాపాడుకోవడానికి ఎమర్జెన్సీ విధించి.. దేశ ప్రజల్ని తీవ్ర ఇక్కట్లకు గురిచేసింది ఇందిర. భారత ప్రజా స్వామ్య చరిత్రలోనే అవి చీకటి రోజులు. వాటి గురించి ఎత్తితే కాంగ్రెస్ పార్టీ డిఫెన్సులో పడిపోతుంది. ఎవరైనా ఆ టాపిక్ తీసుకొస్తే ఉలిక్కి పడుతుంది. ఆ రోజుల్ని చరిత్రలో కప్పెట్టేయడానికే చూస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ.

ఐతే ఇప్పుడా పార్టీకి గుబులు పుట్టించే సినిమా ఒకటి తయారవుతోంది. ఎమర్జీన్సీ నాటి కాలమాన పరిస్థితుల నేపథ్యంలో కాంట్రవర్శల్ డైరెక్టర్ మాధుర్ భండార్కర్ ఓ సినిమా తీస్తున్నాడు. అదే.. ఇందు సర్కార్. ఈ పేరు చూస్తే ఇది ఇందిర పాలన మీద సెటైర్ అనే విషయం అర్థమైపోతుంది. ఇందిరా గాంధీ ప్ర‌ధానిగా ఉండ‌గా ఆమె తనయుడు సంజ‌య్ గాంధీ న‌డిపిన స‌మాంత‌ర ప్ర‌భుత్వం నడపడం.. ఎమ‌ర్జెన్సీలో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరును కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నాడట మాధర్. ఇటీవలే విడుదలైన ట్రైలర్ చూసినా.. ఎమర్జెన్సీ ఛాయలు కనిపిస్తున్నాయి. ఆ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమా కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వచ్చే నెల 28న ‘ఇందు సర్కార్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో కాంగ్రెస్ నేతల్లో గుబులు పట్టుకుంది. కాంగ్రెస్ అగ్ర నేత.. కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాథిత్య సింధియా మీడియా ముందుకు వ‌చ్చి మ‌రీ భండార్క‌ర్‌ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘ఇందూ స‌ర్కార్’లో త‌మ పార్టీకి త‌ప్పుడు ఆపాద‌న‌లు చేశార‌ని.. చిత్రంలో భండార్క‌ర్ చూపించ‌నున్న అంశాల‌న్ని అబ‌ద్ధాల‌ని సింధియా ఆరోపించారు. సినిమా చూడకుండానే సింధియా ఇలా అన్నాడంటే..ఇక సినిమా వచ్చాక ఎంత రచ్చ అవుతుందో.. కాంగ్రెస్ నేతలు ఇంకెంతగా మాధున్ ను టార్గెట్ చేసుకుంటారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/