నాగబాబు ఫైనల్ కామెంట్.. సీరియస్ వార్నింగ్

Fri Jan 11 2019 13:33:20 GMT+0530 (IST)

బాలకృష్ణపై నాగబాబు వరుసగా చేస్తున్న కామెంట్స్ చేసిన విషయం తెల్సిందే. నాగబాబు చివరి వీడియో కోసం జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. నేడు నాగబాబు తన ఫైనల్ కామెంట్ ను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో బాలకృష్ణపై మరింత సీరియస్ గా నాగబాబు వ్యాఖ్యలు చేశాడు. కొన్ని సంవత్సరాల క్రితం బాలకృష్ణ మాట్లాడుతూ చిరంజీవి ఎన్టీఆర్ కాలిగోటికి కూడా సరి పోడు అంటూ వ్యాఖ్యలు చేశాడని నాగబాబు అన్నారు. ఆ వ్యాఖ్యలపై తన ఫైనల్ కామెంట్ ను నాగబాబు ఈ వీడియోలో చేశాడు.బాలకృష్ణ ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో తాను రియాక్ట్ అవ్వాలనుకున్నాను. కాని అన్నయ్య చిరంజీవి ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ బాలకృష్ణ చిన్న పిల్లాడు - ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు అని వదిలేశారు. అన్నయ్య స్పందించడంతో నేను ఏం మాట్లాడలేక పోయాను. రిక్షా తొక్కే వ్యక్తి కొడుకుకు అయినా అతడి తండ్రి గొప్ప వాడే. తండ్రిని కీర్తించుకోవడంలో తప్పులేదు - కాని పక్కవారిని అవమానిస్తూ తండ్రిని కీర్తించడం ఏమాత్రం సంస్కారం కాదు. అదే మాట మేము చిరంజీవి కాలి గోటికి కూడా బాలకృష్ణ సరి పోడు అంటే మీరు - మీ ఫ్యామిలీ - మీ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు. మీకు ఎంత అహంకారం? మాకు కోపాలు రావనుకుంటున్నారా? మంచి మర్యాదతో చెబుతున్నాను దయచేసి మాట్లాడే సమయంలో నోరును అదుపులో పెట్టుకుని మాట్లాడండి. లూజ్ టంగ్ వ్యాఖ్యలు చేయకండి. మాకున్న సంస్కారం వల్లే మేము ఆగుతున్నాం. ఇక్కడ ఎవరు ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఇప్పటి నుండైనా నోరును అదుపులో పెట్టుకుంటే మంచిదంటూ బాలకృష్ణను ఉద్దేశించి నాగబాబు అన్నాడు.

మా తమ్ముడు పవన్ కళ్యాణ్ పై ఎంత రాజకీయ విమర్శలు మేము పట్టించుకోం - రాజకీయ విమర్శలపై నేనేం రియాక్ట్ అవ్వను. చిరంజీవి మాకు అన్నయ్య మాత్రమే కాదు - ఆయన మాత్రం తండ్రితో సమానం - అటువంటి వ్యక్తిపై మీరు చాలా సార్లు నోరు జారారు. ఇకపై మళ్లీ ఎప్పుడైనా తమ కుటుంబం గురించి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే మాత్రం మళ్లీ తాను ఎంటర్ అవ్వాల్సి వస్తుందన్నాడు.

ఇక ఉన్నట్లుండి ఇప్పుడు ఇంతగా ఈ విమర్శలు చేయడం ఏంటని కొందరు జర్నలిస్టులు తనను అడిగారు - దీని వెనుక రాజకీయ ఉద్దేశ్యం ఏమైనా ఉందా అంటూ నన్ను ప్రశ్నిస్తున్నారు. భరించి - భరించి ఇక ఓపిక నశించి తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు స్పందించాను. అంతే తప్ప రాజకీయ ఉద్దేశ్యాలు ఏమీ లేవు. మన ఇంట్లో దొంగ పడ్డాడు - ఎప్పుడో సంవత్సరం తర్వాత ఆ దొంగ కనిపిస్తే సంవత్సరం క్రితం విషయం కదా అని వదిలేయలేం కదా అలాగే పాత విషయాలైనా నేను ఇప్పుడు వాటి గురించి స్పందించానంటూ నాగబాబు తన వరుస కామెంట్స్ కు క్లారిటీ ఇచ్చి - ఈ వివాదాన్ని ఇంతటితో ముగింపు ఇచ్చేశాడు.