లేడీ నేమ్స్ తో నవ్వించే ఖిలాడీలు

Fri Sep 22 2017 23:00:01 GMT+0530 (IST)

టాలీవుడ్ లో ఉన్నంతమంది కమెడియన్స్ వేరే ఏ ఇండస్ట్రీలోనూ ఉండరు అనడంలో డౌట్ అక్కర్లేదు. నిజానికి ఇతర పరిశ్రమల్లో కూడా కమెడియన్స్ ఉన్నా.. అందరూ కలిసి నటించి నవ్వులు పూయించే హెల్దీ ఎట్మాస్ఫియర్ కనిపించదు. అయితే.. మన సినిమాల్లో కామెడీతోనే కాదు.. కేవలం పేర్లతోనే నవ్వించేస్తున్నారు.అమ్మాయిల పేర్లను మేల్ కేరక్టర్స్ కు తగిలించి తెగ నవ్విస్తున్నారు మన డైరెక్టర్స్. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన సాయిధరం తేజ్ మూవీ విన్నర్ లో.. ఇద్దరు కమెడియన్స్ కి ఇలా లేడీస్ నేమ్స్ ఉంటాయి. వెన్నెల కిషోర్ కేరక్టర్ పేరు పద్మ అయితే.. సింగం సుజాత అంటూ రెచ్చిపోయాడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ. ఇద్దరూ సినిమాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. మెగాస్టార్ నటించిన ఖైదీ నంబర్ 150లో చిరు పక్కనే ఉండే ఆలీ పాత్ర పేరు పార్వతి. ఇటు పేరుతో హంగామా చేసిన పార్వతి.. ఆ తర్వాత ఫిమేల్ గెటప్ లోనూ నవ్వించేస్తాడు.

ఆలీ ఇలా లేడీ నేమ్ తో కనిపించడం పవన్ కళ్యాణ్ మూవీ అత్తారింటికి దారేదిలో కూడా కనిపిస్తుంది. ఆ చిత్రంలో పద్దు పేరుతో మేల్ నర్స్ గా నవ్వులు పూయిస్తాడు ఆలీ. బలుపు మూవీలో రవితేజ కలిసి సావిత్రిగానూ ఆలీ అలరిస్తాడు. రచ్చ మూవీలో బ్రహ్మానందం పాత్ర పేరు రంగీలా. డ్యాన్స్ మాస్టర్ గా వచ్చి తర్వాత రామ్ చరణ్ చేతిలో ఇరుక్కుపోతాడు బ్రహ్మీ. అటు కేరక్టర్లతో నవ్వించే మన కామెడీ స్టార్లు.. పేర్లతోనూ పకపకలాడించడంలో తెగ పండిపోయారు.