Begin typing your search above and press return to search.

కమేడియన్ కు బోధపడింది - రాజకీయం వద్దన్నాడు!

By:  Tupaki Desk   |   20 April 2019 6:30 AM GMT
కమేడియన్ కు బోధపడింది  - రాజకీయం వద్దన్నాడు!
X
కమేడియన్ గా తన కెరీర్ పీక్స్ లో ఉన్న దశలో వడివేలు రాజకీయంగా కొన్ని తప్పటడుగులు వేశాడు. అవే ఆయన కెరీర్ ను దారుణంగా దెబ్బ తీశాయి. అప్పట్లో వడివేలు స్టార్ కమేడియన్ గా - చేతి నిండా అవకాశాలతో - భారీ రెమ్యూనరేషన్లతో కెరీర్ ను కొనసాగిస్తూ వచ్చాడు. హీరోలకు తీసిపోని రీతిలో అతడి హవా నడిచింది.

ఆ సమయంలో వడివేలుకు రాజకీయం మీద గాలి మళ్లింది. అందులో భాగంగా డీఎంకేకు మద్దతుదారుగా మారాడు. ఆ పార్టీ తరఫున తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా ప్రచారం చేశాడు వడివేలు. ఊరికే ప్రచారం చేయడం కాదు.. చాలా వెకిలిగా మాట్లాడాడు.

ప్రత్యేకించి విజయ్ కాంత్ ను లక్ష్యంగా చేసుకుని వడివేలు రెచ్చిపోయారు. విజయ్ కాంత్- జయలలిత పార్టీలు అప్పుడు కూటమిగా పోటీ చేశాయి. వడివేలుకు విజయ్ కాంత్ కు సినీ రంగంలో ఏవో గొడవలు ఉండగా.. వాటిని మనసులో పెట్టుకుని వడివేలు రెచ్చిపోయాడు. విజయ్ కాంత్ ను వెకిలిగా చాలా మాటలన్నాడు వడివేలు.

తీరా ఆ ఎన్నికల ఫలితాల్లో సంచలనాలు నమోదయ్యాయి. డీఎంకే కనీసం ప్రతిపక్ష హోదాను సంపాదించుకోలేకపోయింది. అన్నాడీఎంకే తిరుగులేని మెజారిటీతో అధికారాన్ని సంపాదించుకోగా - విజయ్ కాంత్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. డీఎంకే కనీసం ప్రతిపక్షహోదా లేకుండా చతికిలపడింది.

ఆ ఎన్నికల్లో డీఎంకే తరఫున ప్రచారం చేసిన వడివేలుకు అక్కడ నుంచి అసలు తత్వం బోధపడింది. ఇండస్ట్రీ వాల్లే చాలా దూరం పెట్టారు. అవకాశాలు లేకుండా పోయాయి. సొంతంగా నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వడివేలు మళ్లీ పాత ఫామ్ ను అందిపుచ్చుకోలేకపోయాడు!

ఇలాంటి నేపథ్యంలో .. రెండ్రోజుల క్రితం ఓటేయడానికి వెళ్లిన వడివేలును మీడియా వాళ్లు సరదాగా పలకరించి, 'ఏ పార్టీ తరఫున ప్రచారం చేయలేదేం..' అని ఆరా తీయగా.. 'నేను ప్రశాంతంగా ఉండటం మీకు ఇష్టం లేదా..' అన్నట్టుగా స్పందించాడట. మొత్తానికి వడివేలుకు రాజకీయ తత్వం బోధపడినట్టుగా ఉంది!