ఆ వివాదంపై పృథ్వీ ఓపెనయ్యాడు?

Mon Jul 17 2017 16:30:05 GMT+0530 (IST)

కమెడియన్ పృథ్వీకి సంబంధించి ఈ మధ్య ఓ సంచలన వార్త బయటికి వచ్చింది. అతడికి వ్యతిరేకంగా భార్య కోర్టుకెక్కడం.. ఆమెకు నెలకు రూ.8 లక్షలు భరణంగా ఇవ్వాలని కోర్టు ఆదేశించడం తెలిసిన సంగతే. దీనిపై కొంచెం ఆలస్యంగా పృథ్వీ స్పందించాడు. తాను షూటింగ్ కోసం అమెరికాకు వెళ్లడం వల్ల ఇంత ఆలస్యంగా స్పందిస్తున్నట్లు పృథ్వీ చెప్పాడు. భరణం కేసుకు సంబంధించి తనకు ఇప్పటిదాకా నోటీసులే అందలేదని పృథ్వీ చెప్పాడు.

తాను తన పిల్లల్ని చక్కగా చూసుకున్నానని.. కొడుకు.. కూతురు ఇద్దరినీ చదివించి వాళ్ల పెళ్లిళ్లు చేశానని పృథ్వీ చెప్పాడు. డబ్బులు సంపాదించడం మొదలయ్యాక శత్రువులు ఎక్కడి నుంచో కాక ఇంట్లోంచే తయారవుతారని పృథ్వీ అన్నాడు. ‘లౌక్యం’ సినిమా తర్వాత తన మీద కనక వర్షం కురుస్తోందని అంతా అనుకుంటున్నారని.. ఐతే ఈ మధ్య కాలంలో తాను సంపాదించిందంతా పాత అప్పులు కట్టడానికి.. తన కూతురి పెళ్లి చేయడానికే ఖర్చు చేశానని పృథ్వీ చెప్పాడు.

తాను నెలకు రూ.30 లక్షలు సంపాదిస్తానన్న ప్రచారం ఉత్త అబద్ధం అన్నాడు. తనకు రోజుకు రూ.3-4 లక్షలు ఇచ్చే వాళ్లెవరూ ఇండస్ట్రీలో లేరని.. డీమానిటైజేషన్.. జీఎస్టీ దెబ్బకు సినీ పరిశ్రమే దెబ్బ తినే పరిస్థితి వచ్చిందని చెప్పాడు. కోర్టు కేసు కుటుంబ వ్యవహారమని.. దీనిపై తాను కౌంటర్ దాఖలు చేశానని.. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి తాను ఇంతకుమించి ఏమీ మాట్లాడనని పృథ్వీ చెప్పాడు. తన కూతురి పెళ్లి చేశాకే ఇంట్లో కొన్ని సమస్యలు తలెత్తాయని పృథ్వీ చెప్పాడు.