తారక్ తో గ్యాప్ గురించి కమెడియన్ క్లారిటీ

Sat May 18 2019 12:38:56 GMT+0530 (IST)

కమెడియన్ గా మంచి ఫాం లో ఉన్న శ్రీనివాసరెడ్డి అరవింద సమేత వీర రాఘవ ముందు వరకు జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ఇద్దరి మధ్య అపార్థాలు కొనసాగుతున్నాయని త్రివిక్రమ్ సర్దిచెప్పాకే కొంత తగ్గాయని కథనాలు కూడా వచ్చాయి. అవేవి లేవని శ్రీనివాస రెడ్డి స్వయంగా తారక్ తో దిగిన సెల్ఫీ పోస్ట్ చేసి చెక్ పెట్టె ప్రయత్నాలు చేశాడు. ఇదంతా గతం.ఓ మీడియా ఇంటర్వ్యూలో శ్రీనివాస రెడ్డికి దీనికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. తనకు జూనియర్ కు మధ్య గ్యాప్ రావడానికి గల కారణాలు వివరించాడు. అనవసరంగా ఎవరో సృష్టించిన వదంతులకు తన స్నేహ బంధం దెబ్బ తిందని చెప్పాడు

వివరాల్లోకి వెళ్తే టిడిపి తరఫున అప్పట్లో ఎన్నికల ప్రచారంలో తనతో పాటు శ్రీనివాస రెడ్డి హేమ రాజీవ్ కనకాల ఇలా తనకు బాగా సన్నిహితమైన వాళ్లను పార్టీకి మద్దతు ఇచ్చే వాళ్ళను తీసుకెళ్లాడు. ఖమ్మంలో ఓ సభ అయ్యాక ఒకే కారులో ప్రయాణించాల్సిన తారక్ శీనులు అనుకోకుండా విడివిడిగా బయలుదేరారు. తీరా కాసేపటికే జూనియర్ కారుకు యాక్సిడెంట్ అయిపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు. శ్రీనివాస రెడ్డి వెంటనే తలకు గుడ్డ చుట్టి తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

కానీ తారక్ ఫ్రెండ్స్ శీను వల్లే ఇలా అయ్యిందని అనవసరంగా నిందలు వేశారట. అంతేకాదు శ్రీనివాస రెడ్డి స్పందించకపోతే జూనియర్ లైఫ్ డేంజర్ లో ఉండేదన్న అర్థం వచ్చేలా ఏదేదో ప్రచారం చేశారట. ఏదైతేనేం మొత్తానికి యంగ్ టైగర్ సినిమాల్లో శీను ఎంట్రీ బంద్ అయిపోయింది. మళ్ళి అరవింద సమేత నుంచి కొనసాగింది. ఎక్కడైనా సరే చిన్న అపార్థం ఎంతటి దూరం తీసుకువెళ్తాయో దీన్ని బట్టే అర్థమవుతోంది కదా