Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ తో గొడ‌వేంటో చెప్పేసిన అలీ

By:  Tupaki Desk   |   18 March 2018 9:34 AM GMT
ప‌వ‌న్ తో  గొడ‌వేంటో చెప్పేసిన అలీ
X
సినిమా ఇండ‌స్ట్రీలో వినిపించిన‌న్ని పుకార్లు మ‌రే రంగంలోనూ వినిపించ‌వు. ప్ర‌తి చిన్న‌దాన్ని భూత‌ద్దంలో పెట్టి చూస్తుంటారు. ప్ర‌తి దానికి అర్థాన్ని బ‌య‌ట‌కు తీస్తారు. వ‌రుస‌గా ఒక హీరో సినిమాలో న‌టించే ఒక ఆర్టిస్ట్‌.. ఏదైనా సినిమాలో క‌నిపించ‌క‌పోతే చాలు.. ఇంకేముంది..? వారిద్ద‌రికి మ‌ధ్య ఏదో అయ్యింద‌న్న మాట పుట్టించేస్తుంటారు. అలాంటి మాటే ఈ మ‌ధ్య‌న ప‌వ‌న్.. అలీకి మ‌ధ్య వినిపించింది.

ప‌వ‌న్ ఎక్క‌డ‌? అలీ ఎక్క‌డ‌? అన్న డౌట్ అక్క‌ర్లేదు. స్థాయి బేధం ఉన్న‌ప్ప‌టికీ.. ఇరువురు మంచి స్నేహితులు.. అంతేనా.. ప‌వ‌న్ సినిమా అంటే.. అలీ క్యారెక్ట‌ర్ ప‌క్కా. అలాంటిది ప‌వ‌న్ రీసెంట్ మూవీలో అలీ క‌నిపించ‌రు. అంతే.. వారిద్ద‌రికి ఏదో అయ్యింద‌ని.. గొడ‌వ ప‌డ్డారంటూ ప్ర‌చారం మొద‌లైంది.

ఇదే విష‌యాన్ని ఒక ప్ర‌ముఖ ప‌త్రిక చేసిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో అలీనే అడిగేశారు. దానికి ఆయ‌న ఏం చెప్పార‌న్న‌ది ఆయ‌న మాట‌ల్లోనే చూస్తే.. "ఆయన హీరో కాకముందు నుంచి నేను స్నేహితుడిని. ఓసారి చిరంజీవిగారి కోసం ఇంటికి వెళితే ‘రండి - అలీగారు కూర్చోండి.. అన్నయ్య స్నానం చేస్తున్నార’ని చెప్పి నాతో మాటలు కలిపారు. అలా మా మధ్య స్నేహం పెరిగింది. ఆయన తొలి సినిమాలో నేను చేయలేదు. ఇటీవలి ‘అజ్ఞాతవాసి’లో చేయలేదు. మిగతా అన్ని సినిమాల్లో ఉన్నా. ఈ మధ్య పవన్‌ కల్యాణ్‌ కూ - నాకూ గొడవైందని ప్రచారం పుట్టించారు. అవును.. మా ఇద్దరికీ గొడవైంది. అది అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా గురించే (నవ్వుతూ). ఇవాంకా గురించి మీరూ - నేను కొట్టుకున్న మాట నిజమే కదా, అని రేపు ఆయన్ని అడగబోతున్నా కూడా. అయినా మా ఇద్దరికీ గొడవలేముంటాయి? మొన్న పార్టీ ఆఫీస్‌ ప్రారంభోత్సవానికి నన్ను పిలిచారు. వెళ్లాను. వెళ్తూ తెలుగు ఖురాన్‌ తీసుకెళ్లా. విచిత్రం చూడండీ... నాలాగే ఒకరు భగవద్గీత తీసుకొచ్చారు" అని చెప్పారు.

రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నార‌ని.. జ‌న‌సేన‌లో చేర‌తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది క‌దా? అన్న ప్ర‌శ్న‌ను వేస్తే.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చే స‌మ‌యం వ‌స్తే దాన్నెవ‌రూ ఆప‌లేర‌న్నారు అలీ. 1999లో ముర‌ళీమోహ‌న్ టీడీపీ స‌భ్య‌త్వం ఇప్పించార‌ని.. ఆ టైంలో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం చేశాన‌న్నారు. ఇప్పుడు నిర్ణ‌యం ఏమిటంటే మాత్రం చెప్ప‌లేన‌న్నారు.

దేనికైనా స‌మ‌యం రావాల‌ని.. ఇప్పుడే చెబితే వేడి త‌గ్గుతుంద‌న్నారు. పెస‌ర‌ట్టు ఉప్మా వేడి మీద తింటేనే రుచి అన్న ఆయ‌న‌.. జ‌న‌సేన‌లో చేర‌తారంటున్నార‌న్న ప్ర‌శ్న‌ను వేస్తే.. త‌మ ఇద్ద‌రి మ‌ధ్య అలాంటి ప్ర‌స్తావ‌న ఇప్ప‌టివ‌ర‌కూ రాలేద‌న్నారు.

విజ‌యం నాదే.. ఓట‌మి నాదే అనే మ‌న‌స్త‌త్వం ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌ని.. మీకు ఆస‌క్తి ఉందా? నా పై న‌మ్మ‌కం ఉందా? ఉంటే రండని అంటారు. అంతే త‌ప్ప బ‌ల‌వంతం చేయ‌ర‌ని చెప్పారు అలీ. మొత్తానికి జ‌న‌సేన పార్టీలో చేరే విష‌యంపై అలీ అంతగా క్లారిటీ ఇవ్వ‌ని వైనం గ‌మ‌నించారా?