Begin typing your search above and press return to search.

సినిమా చూపిస్త మావ.. నెలకే బ్రేక్ ఈవెన్

By:  Tupaki Desk   |   29 Aug 2015 7:05 AM GMT
సినిమా చూపిస్త మావ.. నెలకే బ్రేక్ ఈవెన్
X
ఒకప్పుడు ఓ పేరున్న సినిమా ఆడియో విడుదలవుతోందంటే.. సంగీత ప్రియులు ఆవురావురుమని ఎదురు చూసేవారు. మార్కెట్ లోకి ఇలా క్యాసెట్లు, సీడీలు రావడం ఆలస్యం.. పాతికో, యాభయ్యో పెట్టి కొనేసేవారు. టేపు అరిగిపోయేదాకా పాటల్ని వినేవారు. కానీ ఇప్పుడు సీడీలు కొనే నాథుడే లేడు. ఏ పాట కావాలన్నా ఇంటర్నెట్ లో ఫ్రీగా దొరికేస్తోంది. అయినా వినే ఓపిక తీరిక ఉండట్లేదు జనాలకు. కొన్ని పెద్ద సినిమాల పాటలు తప్పితే.. చాలా సినిమాల పాటలు జనాలకు చేరువ కావట్లేదు. ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ లు అవీ చేస్తున్నారు కానీ.. అదంతా హంబక్కే అన్న సంగతి అందరికీ తెలుసు. ఈ రోజుల్లో లక్షల్లో సీడీలు అమ్ముడవడం అసాధ్యమన్న సంగతి అందరికీ తెలుసు. అందుకే ఆడియో రైట్స్ పెద్దగా రేటు పలకట్లేదు. పలికినా ఆడియో సంస్థలకు గిట్టుబాటు కావట్లేదు. తామంతా పేరుకే ప్లాటినం డిస్క్ ఫంక్షన్ లు చేస్తామని.. కానీ నిజానికి 500 సీడీలు అమ్ముడవడం కూడా కష్టంగా ఉందని మంచు విష్ణు ఆ మధ్య మొహమాటం లేకుండా చెప్పేయడం గుర్తుండే ఉంటుంంది.

ఇలాంటి పరిస్థితుల్లో ‘సినిమా చూపిస్త మావ’ ఆడియో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఏర్పాటు చేసిన నిర్మాతలు నమ్మశక్యం కాని ఓ మాట చెప్పారు. సాధారణంగా ఆడియో రైట్స్ కు సంబంధించి ఈ కాలంలో బ్రేక్ ఈవెన్ కు రావడానికి ఐదేళ్లు పడుతుందని.. కానీ తమ సినిమా విషయంలో మధుర ఆడియో సంస్థ కేవలం నెల రోజులకే బ్రేక్ ఈవెన్ కు వచ్చేసిందని చెప్పారు. ఐతే ఇందులో వాస్తవమెంత అని అర్థం కావడం లేదు. ‘సినిమా చూపిస్త మావ’ హిట్టయిన మాట వాస్తవం, శేఖర్ చంద్ర మంచి పాటలిచ్చిందీ నిజం. కానీ ఈ చిన్న సినిమా నెల రోజుల్లోనే ఆడియో రైట్స్ విషయంలో బ్రేక్ ఈవెన్ కు వచ్చిందంటే అతిశయోక్తి లాగే ఉంది. ప్లాటినం డిస్క్ ఫంక్షన్ లే పెద్ద మాయ అనుకుంటుంటే.. ఈ మాటలు ఇంకా పెద్ద మాయలా తోస్తున్నాయి.