Begin typing your search above and press return to search.

బాల‌య్య చాలా మంచోడు...అనీ మాస్ట‌ర్!

By:  Tupaki Desk   |   12 Oct 2017 5:27 PM GMT
బాల‌య్య చాలా మంచోడు...అనీ మాస్ట‌ర్!
X
టాలీవుడ్ లో కొరియాగ్రాఫ‌ర్లంటే లారెన్స్‌ - ప్ర‌భుదేవా - రాజు సుంద‌రం - జానీ ఇలా చాలామంది పేర్లు గుర్తుకువ‌స్తాయి. అయితే, లేడీ కొరియోగ్రాఫ‌ర్ల పేర్లు చాలా త‌క్కువ మందికి తెలుసు. టాలీవుడ్ లో మేల్ కొరియోగ్రాఫ‌ర్ల‌తో పోల్చుకుంటే....లేడీ కొరియోగ్రాఫ‌ర్ల‌కు అవ‌కాశాలు త‌క్కువ‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే, అవ‌కాశాల సంగ‌తి ప‌క్క‌న పెడితే - ఇండస్ట్రీలో లేడీ కొరియోగ్రాఫర్లపై కాస్త వివక్ష ఉంద‌ని లేడీ కొరియోగ్రాఫ‌ర్ అనీ మాస్ట‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మేల్ కొరియోగ్రాఫ‌ర్ల‌కు డ్యాన్స‌ర్లంద‌రూ చ‌చ్చిన‌ట్లు న‌మ‌స్కారం చేస్తార‌ని - లేడీ కొరియోగ్రాఫ‌ర్ల‌కు స‌గం మందే చేస్తార‌ని చెప్పారు. త‌మ‌కు హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ చేసే అవ‌కాశం రాద‌ని - కేవలం ఫ్యామిలీ - రొమాంటిక్ - మ్యారేజ్ ఓరియెంటెడ్ సాంగ్ ల‌కు కొరియోగ్ర‌ఫీ చేసే అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ని వాపోయారు. ఓ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా ఆమె అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.

'పైసా వసూల్' చిత్రానికి తొలిసారిగా హీరో ఇంట్రడక్షన్ సాంగ్ చేసే చాన్స్ పూరీ గారు ఇచ్చార‌ని చెప్పారు. అంత‌క‌ముందు బాల‌య్య అంటే భ‌యముండేద‌ని, పని చేశాక ఆయన వ్య‌క్తిత్వం ఎలాంటిదో తెలిసింద‌ని చెప్పారు. కొన్ని సార్లు బాల‌య్య ఎన‌ర్జీ లెవ‌ల్స్ తో తాము పోటీప‌డ‌లేక‌పోయామ‌ని - పాట షూటింగ్ స‌మ‌యంలో ఈ స్టెప్ చేంజ్ చేయ్ అని ఆయ‌న ఒక్క‌సారి కూడా చెప్పలేద‌న్నారు. ఆయ‌న డెడికేష‌న్ వ‌ల్లే ఆ సాంగ్ మంచి హిట్టయింద‌ని - పూరీగారు - బాల‌య్య‌గారి నమ్మకాన్ని వ‌మ్ము చేయ‌నందుకు ఆనందంగా ఉంద‌న్నారు. బాల‌య్య‌ మాస్ట‌ర్స్ కు చాలా గౌర‌వం ఇస్తార‌ని - సెట్స్ కు వ‌చ్చేట‌పుడు - పోయేట‌పుడు నమస్కార్ చేస్తార‌ని - ఆ క్రమశిక్షణ చూసి ఆశ్చర్య పోయానని అనీ మాస్ట‌ర్‌ అన్నారు. బయట విన్న దానికి - ఆయనతో వర్క్ చేసిన దానికి చాలా తేడా ఉంద‌ని - ఆయన గురించి విన్నదంతా తప్పని అర్థమైందన్నారు. ఆయ‌న‌తో పని చేయడం చాలా గ్రేట్ ఎక్స్ పీరియన్స్ అని - బాల‌య్య‌తో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాన‌ని అన్నారు.

తాను మాస్టర్ అయిన తర్వాత రెండు సార్లు ప‌వ‌న్ క‌ల్యాణ్ గారి కోసం వర్షంలో వెయిట్ చేశాన‌ని చెప్పారు. అప్ప‌టికి తానెవ‌రో ప‌వ‌న్ గారికి తెలియ‌ద‌ని - గణేష్ మాస్టర్ సహాయంతో పవన్ గారిని కలిశాన‌ని చెప్పారు. తాను మాస్టర్ అని చెప్ప‌గానే సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో అవకాశం ఇచ్చారని - తర్వాత కాటమరాయుడులో హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ చేశాన‌ని చెప్పారు. ద్వారక సినిమాలో ఓ సాంగ్ కు 2 రోజులు షూట్ చేశాక త‌న‌కు చెప్పకుండా గణేష్ మాస్టర్‌ తో ఆ పాట పూర్తి చేశార‌ని - దాంతో ఏడుపొచ్చి ప్రొడక్షన్ కు ఫోన్ చేసి తిట్టేశాన‌ని - ఆడదాన్ని అని భయపడేదాన్ని కాదని అనీ మాస్టర్ తెలిపారు. వర్షం 50 డేస్ ఫంక్షన్ సమయంలో స్టేజ్ షో ప‌ర్ ఫార్మ‌న్స్ చూసి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాకు అసిస్టెంట్‌ గా చాన్స్ వ‌చ్చింద‌ని చెప్పారు. చిరంజీవి గారి సినిమాలో ఛాన్స్ అంటే ముందు నమ్మలేద‌ని, ఆయ‌న సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. రెండో సినిమాగా గుడుంబా శంకర్ లో కిల్లీ కిల్లీ పాట‌కు అసిస్టెంటుగా చేశానని చెప్పారు.