Begin typing your search above and press return to search.

క‌ళాబంధు టి.సుబ్బ‌రామిరెడ్డి చిట్ చాట్‌

By:  Tupaki Desk   |   18 Sep 2019 4:22 AM GMT
క‌ళాబంధు టి.సుబ్బ‌రామిరెడ్డి చిట్ చాట్‌
X
పారిశ్రామిక‌వేత్త‌గా.. రాజ‌కీయ నాయ‌కుడిగా .. సినీనిర్మాత‌గా .. గొప్ప ఆధ్యాత్మిక ప‌రుడిగా ఆయ‌న‌లో అన్ని కోణాలపైనా అభిమానుల్లో నిరంత‌రం చ‌ర్చ సాగుతుంటుంది. ఎన్టీఆర్ - ఏఎన్నార్ - చిరంజీవి స‌హా నేటిత‌రం హీరోల‌తోనూ ఆయ‌న ఎంతో స‌న్నిహితంగా ఉంటారు. ఇండియాలోని అన్ని సినీప‌రిశ్ర‌మ‌ల‌తో అనుబంధం క‌లిగి ఉన్న ఏకైక‌ క‌ళాబంధువు ఆయ‌న‌. సెప్టెంబ‌ర్ 17తో ఆయ‌న 77వ వ‌సంతంలోకి అడుగు పెడుతున్నారు టి.సుబ్బ‌రామిరెడ్డి. ఈ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా స్పెష‌ల్ చిట్ చాట్ విశేషాలు

అక్కినేనితో అనుబంధం?

నా జీవితంలో మ‌ర‌పురాని వ్య‌క్తి ఏఎన్నార్‌. అక్కినేని నాగేశ్వ‌ర‌రావుగారితో స్నేహం.. మ‌ర‌పురాని బంధం. నా 29 వ‌య‌సులోనే ఏఎన్నార్ ఇంటి ప‌క్క‌నే ఇల్లు నిర్మించుకోవ‌డంతో.. అప్ప‌టి నుంచి ఆయ‌న‌తో అనుబంధం ఏర్ప‌డింది. నాకంటే 19ఏళ్లు పెద్దాయ‌న‌. మేం ఇద్ద‌రం స‌మాన వ‌య‌స్కుల్లా క‌లిసిపోయాం. ఆయ‌న వ‌ల్ల‌నే సినీప‌రిశ్ర‌మ‌లో స్నేహాలు పెరిగాయి. ఆయ‌న‌కు నేనంటే అభిమానం.. నాకు ఆయ‌నంటే అభిమానం. ఒక‌ప్పుడు అక్కినేని ఇంటి ప‌క్క‌న సుబ్బ‌రామిరెడ్డి ఇల్లు.. ఇప్పుడు సుబ్బ‌రామిరెడ్డి ఇంటి ప‌క్క‌న అక్కినేని ఇల్లు అంటూ ఆయ‌న నాతో స‌ర‌దా వ్యాఖ్య‌లు చేసేవారు.

నేటి మ‌ల్టీప్లెక్స్ క‌ల్చ‌ర్ మొద‌ల‌వ్వ‌ని రోజుల్లో మీరు థియేట‌ర్ల నిర్మాణం చేప‌ట్టారు క‌దా?

* సినిమా థియేటర్ల నిర్మాణం వైపు అడుగులేయడానికి ప్రధాన కారణం ఏమైనా ఉందా? అంటే.. ఆరోజుల్లోనే మ‌హేశ్వ‌రి-ప‌ర‌మేశ్వ‌రి థియ‌ట‌ర్ నిర్మించాం. హైద‌రాబాద్ లో 30 ఏళ్ల క్రిత‌మే ఒక ల్యాండ్ మార్క్ లాంటి సినిమా ఆర్చ్ క‌ట్టాం. రోమ‌న్ ఆర్కిటెక్చ‌ర్ తో హైద‌రాబాద్ లో ఎస్క‌లేట‌ర్ ని నిర్మించాం. అప్ప‌ట్లో మ‌ల్టీప్లెక్సులేవీ హైద‌రాబాద్ లో లేవు. థియేట‌ర్ల‌లో తొలిసారి మ‌ల్టీప్లెక్స్ త‌ర‌హాలో మ‌హేశ్వ‌రి-ప‌ర‌మేశ్వ‌రి థియేట‌ర్ల‌ను ప్రారంభించాం.

బాలీవుడ్ తో మీ అనుబంధం?

అమితాబ్ - య‌శ్ చోప్రాల‌ సిల్ సిలా హైద‌రాబాద్ లో రిలీజై హిట్ అయ్యింది. అప్ప‌ట్లోనే య‌శ్ చోప్రాతో ప‌రిచ‌యం స్నేహంగా మారింది. ఆయ‌న అప్ప‌ట్లో ఆరు సినిమాలు వ‌రుస‌గా ప్లాపుల‌య్యాయి. దాంతో ప‌రిశ్ర‌మ వ‌దిలేయాల‌నుకున్నారు. కానీ నేను ధైర్యం చెప్పి ఇద్ద‌రం క‌లిసి సినిమాలు చేద్దామ‌ని అన్నాను. అస‌లు సినిమాలు తీయ‌డం వేరు. ఫైనాన్స్ చేయ‌డం వేరు. ఆ టైమ్ లో ఆయ‌న‌తో క‌లిసి సినిమాలు చేశాను. క‌లిసి మూడు సినిమాలు చేస్తే పెద్ద హిట్ట‌య్యాయి. నా స్వ‌భావం అంద‌రితో క‌లిసిపోతాను కాబ‌ట్టి స్నేహం కుదిరింది. దిలీప్ కుమార్- దేవానంద్- ధ‌ర్మేంద్ర వంటి టాప్ స్టార్ల‌తో స్నేహం ఏర్ప‌డింది. య‌శ్ చోప్రా దాదాపు 40 సంవ‌త్స‌రాలు టాప్ డైరెక్ట‌ర్. ఆయ‌న చ‌నిపోయాక ఆయ‌న గుర్తుగా కుటుంబ‌స‌భ్యులు బంధు మిత్రులు ఏమీ చేయ‌క‌పోయినా .. ప్ర‌తి సంవ‌త్స‌రం 10ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి నేను య‌శ్ చోప్రా పేరుతో అవార్డులు ఇస్తున్నాను. అమితాబ్- హేమ‌మాలిని- షారూక్- రేఖ వంటి వారికి అవార్డులిచ్చాను. క‌ళ‌పై నా ప్రేమ ప్ర‌తిసారీ అలాగే చూపించ‌డంతో ప‌రిశ్ర‌మ‌కు ద‌గ్గ‌ర‌య్యాను.

మీ సినీ కెరీర్ గురించి?

నా తొలి సినిమా ర‌జ‌నీకాంత్ తో జీవ‌న పోరాటం. ఆయ‌న‌ను ఒప్పించ‌గ‌లిగాను అప్ప‌ట్లో. శోభ‌న్ బాబు - ర‌జ‌నీకాంత్ - విజ‌య‌శాంతి- రాధిక ఈ న‌లుగురిని క‌లిపి సినిమా చేశాను. హిందీ చిత్రం `రోటీ క‌ప‌డా కా ..` స‌బ్జెక్ట్ తో ఈ సినిమా చేశాం. తొలిసారి విదేశీ షూటింగ్ చేశాం. హాంకాంగ్ వెళ్లి.. వేరొక‌టి చేశాం. అర్జున్- ఖుష్బూ కాంబినేష‌న్ తో. మూడో సినిమా చిరంజీవితో స్టేట్ రౌడీ చేశాను. చిరంజీవితో దాదాపు 10 సినిమాలు చేశాను.

అవార్డులు ఇవ్వ‌డం ఎప్ప‌టి నుంచి అల‌వాటు?

1976లో పి.సుశీల గారికి నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో వైభ‌వంగా వేడుక‌లు చేశాను. అక్కినేని - సీనారే- ఆషా బోంస్లే- పిసుసీల‌- జాన‌కి-జేసుదాసు- జ‌మున- జ‌య‌ప్ర‌ద‌ ఇలా అంద‌రికి స‌న్మానాలు చేస్తున్నాం. ఈ సంవ‌త్స‌రం పుట్టిన‌రోజుకు జ‌య‌సుధ‌కు స‌న్మానం చేస్తున్నాను.

ఈ బ‌ర్త్ డే ప్ర‌త్యేక‌త‌?

ఈ ఏడాది బ‌ర్త్ డేకి వైజాగ్ కి రెండు పండ‌గ‌లు. ఒక‌టి నా పుట్టిన‌రోజు. రెండోది మ‌హాశివ‌రాత్రి. వేలాది మంది భ‌క్తులంద‌రికీ కావాల్సిన స‌దుపాయాలు చేయ‌బోతున్నాను ఆరోజు. వైజాగ్ ప్ర‌జ‌లు బావుండాల‌ని ప్ర‌త్యేక పూజ‌లు- అర్చ‌న‌లు చేస్తున్నా. ఈశ్వ‌రుడి ఆశీస్సులు అందరికీ ఉంటాయి.

మీ సినీ క‌నెక్ష‌న్ ఎప్ప‌టి నుంచి?

న‌టుడు ర‌ణ‌మారెడ్డి నాకు చిన్నాన్న‌. ప‌ట్టాభి గారితో అనుబంధం ఉంది. మా నాన్న ద్వారానే ప‌ట్టాభి స్నేహితులు. 1965లోనే ఎస్వీఆర్ వంటి ప్ర‌ముఖుల ప‌రిచ‌యానికి చిన్నాన్న కార‌ణం.

చిరంజీవి-ప‌వ‌న్ తో సినిమా ఎప్పుడు?

చిరంజీవి రాజ‌కీయాల్లోకి వెళ్లిపోవ‌డంతో అప్ప‌ట్లో సినిమా చేయాల‌నుకుని చేయ‌లేదు. ఇప్పుడు ఆయ‌న రెడీగా ఉంటే నేను సినిమా చేయ‌డానికి రెడీ. అయినా నేను సినిమాల‌తో సంపాదించ‌ను. బిజినెస్ లో సంపాదిస్తాను. సినిమాలు తీసి సంపాదించే నిర్మాత‌లు త‌క్కువ‌మంది. సినిమాల‌తో నిర్మాత‌ల‌కు డ‌బ్బులు రావు. తెలుగు .. హిందీ .. ఎక్క‌డా స‌క్సెస్ లేదు. ఎక్కువ శాతం ఇక్క‌డ పోతుంది కానీ రాదు. 95 శాతం నిర్మాత‌లు పోయింది ఇందుకే. 5 శాతం స‌క్సెస్ మాత్ర‌మే ఉంది.

జ‌య‌సుధ అవార్డు మ్యాట‌ర్స్?

జ‌య‌సుధకు ఈ పుట్టిన‌రోజున `అభిన‌య మ‌యూరి` అవార్డు ఇస్తున్నాం. ఈ కార్య‌క్ర‌మానికి సినీరాజ‌కీయ ప్ర‌ముఖులు విచ్చేస్తున్నారు. రాధిక‌- సుహానిసి- మోహ‌న్ బాబు- బ్ర‌హ్మానందం- వాణిశ్రీ‌- శార‌ద‌- జెమున‌- ప్ర‌గ్యా జైశ్వాల్ - రోజా- బ్ర‌హ్మానందం త‌దిత‌రులు వ‌స్తున్నారు. 14 మంది ఎంపీలు- మంత్రులు వ‌స్తున్నారు.

సినిమా- క‌ళ అంటే ఎందుకంత ఇష్టం?

భ‌గ‌వంతుని సృష్టిలో ప్ర‌తి ఒక్క‌రికి ఏదో ఒక క‌ళ ఉంటుంది. 24 క‌ళ‌లు క‌లిసి సినిమాగా చూస్తాం. ప్ర‌పంచం మ‌ర్చిపోయి సినిమా చూస్తాం. అస‌లు సినిమాని బీట్ చేసేదే లేదు. సినిమా క‌ళాకారులు దైవానికి సంబందీకులు అని చెబుతాను. దైవానికి సంబంధం ఉన్న‌వాళ్లు క‌ళాకారులు. అందుకే మంచి మ‌నుషులుగా ఉండాలి.

సినిమా- రాజ‌కీయం- బిజినెస్ దేనికి ఎక్కువ ప్రాధాన్య‌త‌?

మూడు గంట‌ల పాటు సినిమా అనే లోకంలోకి వెళితే అన్నీ మ‌ర్చిపోతాం. అదొక కొత్త ప్ర‌పంచం.. వేరొక గ్ర‌హంపైకి వెళ్లిన‌ట్టే అన్నిటినీ మ‌రిపిస్తుంది. అంత‌కు మించిన రంగం ఏదీ లేదు. ఆ త‌ర్వాత‌నే రాజ‌కీయం.. బిజినెస్ లో స‌క్సెస్ ఏవైనా నాకు ప్రాధాన్య‌త‌.