Begin typing your search above and press return to search.

త‌మ్ముడేమో తిట్టి తాట తీస్తారు.. అన్న‌య్యేంటిలా?

By:  Tupaki Desk   |   18 Feb 2019 5:31 AM GMT
త‌మ్ముడేమో తిట్టి తాట తీస్తారు.. అన్న‌య్యేంటిలా?
X
ఓవైపు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఫైర్ బ్రాండ్ గా మారి హిందూపురం ఎమ్మెల్యే, న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌ను ఓ రేంజులో తిట్టేస్తున్నారు. త‌మ్ముడు.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ కి అండ‌గా నిలుస్తూ.. తేదేపా వ‌ర్గాల‌తో క‌లిపి బాల‌య్య‌పైనా విరుచుకుప‌డుతున్నారు. నాగ‌బాబు యూట్యూబ్ ఇంట‌ర్వ్యూల క‌ల‌క‌లం గురించి నిరంత‌రం చ‌ర్చ సాగుతోంది. ఆయ‌న ఫైరింగ్ కి ప్ర‌త్య‌ర్థులు ఛ‌లోక్తులు విసురుతున్నారు. స‌రిగ్గా ఇలాంటి టైమ్ లో ఓ అవార్డుల కార్య‌క్ర‌మంలో స‌న్నివేశం ఆస‌క్తి రేకెత్తించింది.

ఒకే ఫ్రేమ్ లో ఒకే వేదిక‌పైకి అన్న‌య్య చిరంజీవి.. నంద‌మూరి బాల‌కృష్ణ రావ‌డం ఉత్కంఠ పెంచింది. ఆ ఇరువురు అగ్ర క‌థానాయ‌కులుగా ఇప్ప‌టికీ రేసులోనే ఉన్నారు. రాజ‌కీయాల్లోనూ ఉన్నారు. టాలీవుడ్ వ‌జ్రోత్స‌వాల వేళ‌నో లేక క‌ళాబంధు టీఎస్సార్ పుట్టిన‌రోజుల‌కో క‌లుస్తారు త‌ప్ప మామూలుగా అయితే క‌లిసే స‌న్నివేశ‌మే లేదు. ఈసారి కూడా అలాంటి సంద‌ర్భంలోనే క‌లిసారు. టీఎస్సార్ జాతీయ అవార్డుల‌ వేదిక‌పై మెగా, నంద‌మూరి హీరోలు క‌లుసుకుని అవార్డులు పంచుకున్నారు. ఆస‌క్తిక‌రంగా ఈ వేదిక‌పై చిరు చేసిన ఓ వ్యాఖ్య జ‌నాల్లో వాడి వేడి చ‌ర్చ‌కు తావిచ్చింది.

``మా మ‌ధ్య అన్న‌ద‌మ్ముల అనుబంధం ఉంది. మేం మంచి స్నేహితులం`` అంటూ చిరు టీఎస్సార్ అవార్డుల వేడుక‌లో వ్యాఖ్యానించ‌డం ఆస‌క్తి రేకెత్తించింది. ఈ సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మ వీక్ష‌కుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఓవైపు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు తిట్టి తాట తీస్తుంటే.. అన్న‌య్యేమో ఇదిగో ఇలా క‌వ‌ర్ చేస్తున్నారు.. అంటూ ఛ‌లోక్తిగా మాట్లాడుకున్నారంతా. టీఎస్సార్ అవార్డుల వేడుక‌లో చిరంజీవి మాట్లాడుతూ-``మా మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉందని.. మంచి స్నేహితులమేన‌ని మీకు (జ‌నం) తెలియజేసేందుకు ఇదొక చక్కని సందేశం కూడా. మా అభిమానులందరూ ఎటువంటి భేదాలు లేకుండా కలిసి కట్టుగా ఉండేట్లు ఇది దోహదం చేస్తుంది`` అన్నారు. ఈ రోజు బాలకృష్ణ, నాగార్జున, మోహన్‌ బాబుకి అవార్డు వచ్చింది. నాకు మాత్రం ఏ అవార్డు రాలేదు`` అంటూ చిరు న‌వ్వేశారు. రామ్‌ చరణ్‌ అవార్డులు అందుకొని, ఆ పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాన‌ని అన్నారు. టీఎస్సార్ పిల‌వ‌డం వ‌ల్ల‌నే మేమంతా మనసుతో .. ఇష్టంతో వచ్చాం. ఓ వేడుకకు మేం అందరం కలిసి రాలేం. ఆ ప్రయత్నం ఎవరూ చేయరు. అది ఒక సుబ్బరామిరెడ్డి వల్లే అవుతుంద‌ని పొగిడేశారు చిరు.