Begin typing your search above and press return to search.

కూల్ చిరు.. ఇండ‌స్ట్రీకి వార్నింగ్ ఇచ్చేశారు

By:  Tupaki Desk   |   20 Aug 2018 4:30 AM GMT
కూల్ చిరు.. ఇండ‌స్ట్రీకి వార్నింగ్ ఇచ్చేశారు
X
మెగాస్టార్ చిరంజీవికి సాధార‌ణంగా కోపం కాదు. ఎప్పుడూ కూల్ గా ఉంటారు. పెద్ద‌త‌ర‌హాలో వ్య‌వ‌హారిస్తారు. ఆచితూచి అన్న‌ట్లు మాట్లాడ‌తారు. తొంద‌ర‌ప‌డ‌టం ఆయ‌న‌లో అస్స‌లు క‌నిపించ‌దు. ఆగ్ర‌హం క‌లిగినా.. త‌న మాట‌ల్లో కోపాన్ని ప్ర‌ద‌ర్శించ‌కుండా కూల్ గా వ్య‌వ‌హ‌రించ‌టం ఆయ‌న‌కు అల‌వాటుగా చెబుతారు. కానీ.. తాజాగా చిరు త‌న‌లో మ‌రో యాంగిల్ చూపించారు.

ఇప్ప‌టివ‌ర‌కూ ఏ వేదిక మీద చూపించ‌ని ఆగ్ర‌హాన్ని తాజాగా ప్ర‌ద‌ర్శించారు. గీతాగోవిందం స‌క్సెస్ మీట్ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌కు ముఖ్యఅతిధిగా హాజ‌రైన ఆయ‌న‌.. గీతాగోవిందం స‌న్నివేశాలు ముందే లీక్ కావ‌టంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. ఇండ‌స్ట్రీ మొత్తానికి వార్నింగ్ ఇచ్చేశారు.

అర‌వింద్ సినిమా లీక్ అయింద‌ని చెప్పిన‌ప్పుడు.. వ‌ర్రీ కావొద్ద‌ని.. త‌న త‌మ్ముడు ప‌వ‌న్ అత్తారింటికి దారేది సినిమా కూడా లీకైన విష‌యాన్ని గుర్తు చేశాన‌న‌న్నారు. అత్తారింటికి దారేది సినిమా విజ‌యానికి లీకు అడ్డుగా నిల‌వ‌లేద‌ని.. అదే సెంటిమెంట్ గీతాగోవిందం స‌క్సెస్ కు ఎలాంటి అడ్డు కాద‌ని.. అదో సెంటిమెంట్ అనుకోండ‌ని తాను చెప్పిన‌ట్లుగా చెప్పారు.

అయితే.. అర‌వింద్‌కు తాను చెప్పిన మాట‌ల‌న్ని ఊర‌డింపేన‌ని స్ప‌ష్టం చేసిన చిరు.. కోట్లు ఖ‌ర్చు పెట్టి సినిమా తీస్తే స్నేహితుల‌కు చూపించ‌టానికి కుర్ర‌త‌నంతో లీక్ చేయ‌టం ఎంత వ‌ర‌కు స‌బ‌బు? అని ప్ర‌శ్నించారు. ఇదేం న్యాయ‌మ‌ని సూటిగా ప్ర‌శ్నించిన మెగాస్టార్.. చిత్ర ప‌రిశ్ర‌మ ఎంతోమందికి క‌న్న‌త‌ల్లిలాంటిద‌ని.. ఇక్క‌డ ప‌ని చేసే వ్య‌క్తులు సినిమాను దొంగ‌లించి షేర్ చేయ‌టం ఎంత వ‌ర‌కు స‌బ‌బు? అని ప్ర‌శ్నించారు.

రిలీజ్ కు ముందు చిత్రాన్ని దొంగ‌లించ‌టం అంటే.. కోట్ల‌ను దొంగ‌లించిన‌ట్లేన‌ని.. అందుకే సినిమా ఇండ‌స్ట్రీలోని ప్ర‌తి ఒక్క‌రిని తాను హెచ్చ‌రిస్తున్నాన‌ని.. ఎవ‌రైనా బాధ్య‌తారాహిత్యంతో వ్య‌వ‌హ‌రిస్తే త‌ల్లిపాలు తాగి రొమ్మును గుద్దిన‌ట్లేన‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.ఈ త‌ర‌హాలో చిరు ఎప్పుడూ రియాక్ట్ కాలేద‌ని.. గీతాగోవిందం లీక్ ఆయ‌న్ను తీవ్రంగా ప్ర‌భావితం చేసిన‌ట్లుగా చెబుతున్నారు.