చిరు.. ఆమాత్రం రిస్క్ చేసి ఉంటేనా!

Thu Jan 12 2017 09:53:44 GMT+0530 (IST)

బహుశా చిరంజీవి సైతం తన రీఎంట్రీ మూవీకి ఈ రేంజిలో హైప్ వస్తుందని ఊహించి ఉండడేమో. చిరు పునరాగమనం కోసం మెగా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మాట వాస్తవమే. కానీ ఆ ఆసక్తి మరీ ఈ  స్థాయిలో ఉందని ఎవరూ అనుకోలేదు. రెండు రోజుల ముందు వరకు ఓ మాదిరిగా ఉన్న హైప్.. తర్వాత తర్వాత అమాంత పెరిగిపోయి రిలీజ్ రోజుకు ఊహించని స్థాయికి చేరుకుంది. ‘ఖైదీ నెంబర్ 150’ టికెట్ల కోసం ఎంతెంత రభస జరుగుతోందో అందరూ చూస్తున్నారిప్పడు. ‘ఖైదీ నెంబర్ 150’ రీమేక్ అని తెలిసినా.. ఏం చూడబోతున్నామో ముందే ఓ అవగాహన ఉన్నా.. జనాల్లో ఇంత ఆసక్తి ఉండటం విశేషమే.

ఒకప్పుడు రీమేక్ అంటే జనాలకు మాతృక గురించి పెద్దగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఫలానా హీరో ఒక రీమేక్ చేస్తున్నాడనగానే ఇంటర్నెట్లో ఆ సినిమా గురించి వెతికి సమస్త సమాచారం తెలుసుకుంటున్నారు. డౌన్ లోడ్ చేసి సబ్ టైటిల్స్ తో సినిమా కూడా చూసేస్తున్నారు. దీంతో రీమేక్ అనగానే సినిమా మీద ఆసక్తి సన్నగిల్లిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ‘ఖైదీ నెంబర్ 150’ మీద ఇంత హైప్ రావడం విశేషమే. ఐతే రీఎంట్రీ కోసం రీమేక్ ఎంచుకుని సేఫ్ గేమ్ ఆడకుండా.. చిరు ఒక స్ట్రెయిట్ మూవీ చేసి ఉంటే ఇంకెంత హైప్ ఉండేదో అంచనా వేయొచ్చు. ‘కత్తి’ రీమేక్ అనగానే కథ గురించి తెలుసుకుని.. అందులో చిరు ఎలా చేసి ఉంటాడో ఓ అంచనాకు వచ్చేశారు జనాలు. ఇక సినిమాలో చేసిన మార్పులు చేర్పుల గురించి.. హైలైట్ల గురించి కూడా ముందే తెలిసిపోయింది. అలా కాకుండా ఓ కొత్త కథతో సినిమా చేసి.. అన్ని విశేషాలనూ దాచి పెట్టి ఉంటే.. ఆ సినిమాపై జనాల్లో ఇంతకు ఎన్నో రెట్లు ఆసక్తి ఉండేది. మంచి కథే పడి.. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే దాని రేంజి ఇంకెక్కడో ఉండేది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/