Begin typing your search above and press return to search.

మెగాస్టార్ మాటలు మొదలెట్టేశారుగా!!

By:  Tupaki Desk   |   25 Sep 2016 4:28 AM GMT
మెగాస్టార్ మాటలు మొదలెట్టేశారుగా!!
X
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా ఖైదీ నెంబర్ 150 షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో కోలీవుడ్ కత్తికి రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రారంభంలో జైల్ ఎపిసోడ్స్.. రీసెంట్ గా హీరోయిన్ కాజల్ అగర్వాల్ యూనిట్ తో జతయ్యాక వృద్ధాశ్రమానికి సంబంధించిన సన్నివేశాలు.. ఇంటర్వెల్ సమయంలో వచ్చే కాయిన్ ఫైట్.. క్లైమాక్స్ కి ముందు వచ్చే న్యూస్ ఛానల్ సీన్స్.. ఇలా కీలకమైన సీన్స్ అన్నీ శరవేగంగా షూటింగ్ అయిపోతున్నాయి.

మరోవైపు.. ఇప్పటివరకూ పిక్చరైజ్ చేసిన సీన్స్ కు మెగాస్టార్ డబ్బింగ్ చెప్పడం కూడా మొదలుపెట్టేశారని తెలుస్తోంది. ఇంకా పిక్చరైజేషన్ పూర్తి కాకముందే డబ్బింగ్ స్టార్ట్ చేసేయడం చాలామంది ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే.. ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి రెండు పాత్రలు పోషిస్తుండడంతో.. డబ్బింగ్ విషయంలో రెండు పాత్రల మధ్య వేరియేషన్ ఉండేందుకు గాను.. ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట. పైగా ఎప్పటికప్పుడు ఇలా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసేయడం ద్వారా సంక్రాంతి రిలీజ్ డెడ్ లైన్ ను ఈజీగా అందుకోవచ్చని మెగాస్టార్ ఉద్దేశ్యంగా తెలుస్తోంది.

ఒకవైపు షూటింగ్.. డబ్బింగ్ పనులతో బిజీగా ఉంటూనే.. మెగాస్టార్ చిరింజీవి తన అభిమానులను తరచుగా కలుసుకుంటూనే ఉన్నారు. తమతో చిరు స్పెషల్ గా దిగిన ఫోటోలను ఆయా అభిమానులు షేర్ చేసుకుంటూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.