Begin typing your search above and press return to search.

నేను కాదు.. ఆయనే ఇనిస్పిరేషన్ -చిరు

By:  Tupaki Desk   |   13 Dec 2017 3:56 AM GMT
నేను కాదు.. ఆయనే ఇనిస్పిరేషన్ -చిరు
X
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకునే నటుల్లో ఎక్కువమంది చెప్పేది చిరంజీవి పేరునే. ఓ మామూలు నటుడు మెగా స్టార్ అయిన తీరు అందరికీ ఇన్ స్పిరేషనే. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది లాగా ఒకానొక దశలో తానుకూడా ఆశ-నిరాశల మధ్య ఊగిసలాడిన వాడినేనని.. అవకాశాలు వస్తాయో రావో.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలనో లేదో అని మధనపడ్డ రోజులు చాలానే ఉన్నాయని చిరంజీవి చెప్పుకొచ్చారు.

నిన్నటివరకు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కయిన దాసరి నారాయణరావు జీవితంపై పసుపులేటి రామారావు రాసిన ‘తెరవెనుక దాసరి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన చిరంజీవి తన సినీ రంగ ప్రవేశంనాటి రోజులను గుర్తు చేసుకుంటూ మాట్లాడారు. తన కాన్ఫిడెన్స్.. కష్టమే ఈ స్థాయికి చేర్చాయని అన్నారు. ‘‘చిరంజీవి ఎలాంటి అడ్రస్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడని.. ఇంతటి వాడయి అందరికీ ఇన్ స్పిరేషన్ అయ్యాడని దాసరి నారాయణరావు అంటుండేవారు. నేను కాదు. ఆయనే అందరికీ ఇన్ స్పిరేషన్. వెనుక ముందు ఎవరూ లేకుండా ఉద్యోగం వదిలి వచ్చి తన సొంత ప్రతిభతో పైకెదిగి ఇండస్ట్రీలో ఎందరికో బాసటగా నిలిచే స్థాయికి ఎదిగిన ఆయనే అందరికీ స్ఫూర్తి'' అన్నారు చిరంజీవి.

ఇంకా మాట్లాడుతూ.. ''సినీ పరిశ్రమ గురించి చెప్పాలంటే దాసరి ముందు.. దాసరి తరవాత అని చెప్పే బ్రిడ్జ్‌ లా ఉన్నారాయన. ఆయన ఇప్పుడు సినిమాల్లోకి వచ్చేవారికి.. నటిస్తున్న వారికి.. ఎంతో సాధించేశాం అనుకునే వారికి ఓ సోర్స్ ఆఫ్ ఇన్ స్పిరేషన్. ఆయన కీర్తిశేషులు కాదు.. కీర్తి విశేషులు’’ అంటూ దాసరి పట్ల చిరంజీవి తన గురుభావాన్ని చాటుకున్నారు.