Begin typing your search above and press return to search.

కొణిదెల లేడీస్‌ తో కొదమసింహం

By:  Tupaki Desk   |   11 Feb 2016 7:10 AM GMT
కొణిదెల లేడీస్‌ తో కొదమసింహం
X
మెగాస్టార్ చిరంజీవి మంచి ఫ్యామిలీ మ్యాన్ అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కుటుంబానికి ఆయన చాలా ప్రాధాన్యం ఇస్తారు. వాళ్ల కోసం చాలా సమయం కేటాయిస్తుంటారు. సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. రాజకీయాల నుంచి కూడా విరామం తీసుకున్నాక ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతున్నారు చిరు. తాజాగా తన చిన్న కూతురు శ్రీజకు మళ్లీ పెళ్లి చేయబోతున్న నేపథ్యంలో దగ్గరుంచి అన్ని పనులూ చూసుకుంటున్నారు చిరు. ఈ సందర్భంగా శ్రీజతో పాటు తన పెద్ద కూతురు సురేఖ, కోడలు ఉపాసనలతో కలిసి ఆయన దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటో చాలా ప్రత్యేకంగా కనిపిస్తుండటానికి ఇందులో చిరు లుక్ కూడా ఓ కారణం.

‘కత్తి’ రీమేక్ తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న చిరు.. కొన్ని రోజులుగా తన లుక్ ను పూర్తిగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఆల్రెడీ బరువు తగ్గడంతో పాటు ముఖంలోనూ మునుపటి గ్లామర్ తెచ్చుకునేందుకు కసరత్తులు చేస్తున్నాడు. గత ఏడాదితో పోలిస్తే చిరు సరికొత్తగా దర్శనమిస్తున్నాడు. అటు ఇటుగా ఇంకో నెల రోజుల్లో ‘కత్తి’ రీమేక్ సెట్స్ మీదికి వెళ్లొచ్చని సమాచారం. ఇందులో చిరు ద్విపాత్రాభినయం చేయబోతుండటం విశేషం. చిరు ఇమేజ్ కు తగ్గట్లుగా ‘కత్తి’ని మరింత పదునెక్కించే పనిలో ఉంది వి.వి.వినాయక్ బృందం. ఈ చిత్రాన్ని రామ్ చరణే స్వయంగా నిర్మించబోతుండటం విశేషం.