జర్నలిస్ట్ కు చిరు రూ.వంద ఎందుకిచ్చారు?

Wed Dec 13 2017 10:29:55 GMT+0530 (IST)

ఆసక్తికర విషయాన్ని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఒక సీనియర్ పాత్రికేయుడు రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం ఒక ఫైవ్ స్టార్ హోటల్లో సాధ్యమా? అంటే.. లేదనే చెబుతారు. కానీ.. అందుకు భిన్నంగా  పసుపులేటి రామారావు రాసిన తెర వెనుక దాసరి పుస్తకాన్ని టి. సుబ్బిరామిరెడ్డికి చెందిన హోటల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మెగాస్టార్ ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు.తన కెరీర్ తొలినాళ్లలో తన గురించి ఒక ఆర్టికల్ రాశారని చెప్పారు. తాను అప్పుడప్పుడే అవకాశాలు వస్తున్న సమయమని.. ఆ రోజుల్లో తనకు వంద రూపాయిలు అంటే ఎక్కువేనని.. అయినా తన గురించి రాసినందుకు బహుమతిగా జేబులో ఉన్న వంద రూపాయిల్ని ఇవ్వబోతుంటే.. కరెంటు షాక్ తగిలినట్లుగా పసుపులేటి వెనక్కి వెళ్లారని.. వృత్తి జీవితం పట్ల అంత కమిట్ మెంట్ ఉన్న వారు చాలా అరుదన్నారు. ఆ రోజున ఆయన ముఖంలో కనిపించిన ఎక్స్ ప్రెషన్ తనకీ రోజుకి గుర్తుందన్నారు.

రాయటం తన వృత్తి అని.. దానికి బహుమతి తీసుకోవటం తప్పన్న పసుపులేటి విలువలకు నిలువెత్తు రూపమన్నారు. పుస్తకం రాసిన విషయం గురించి తెలిసి.. మిగిలిన పుస్తకాల మాదిరి కాకుండా గ్రాండ్ గా చేయాలన్న ఆలోచనతో టి.సుబ్బరామిరెడ్డికి ఫోన్ చేస్తే ఆయన పదినిమిషాల్లో అన్ని ఏర్పాట్లు చేయటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పుస్తకావిష్కరణ సందర్భంగా తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు మెగాస్టార్.