Begin typing your search above and press return to search.

వాటే 'మెగా' కంబ్యాక్.. శభాష్‌ చిరు!!

By:  Tupaki Desk   |   11 Jan 2017 6:53 AM GMT
వాటే మెగా కంబ్యాక్.. శభాష్‌ చిరు!!
X
చేస్తోంది రీమేక్ సినిమా. పైగా లేటు వయస్సులో కమర్షియల్ మసాలా మూవీ. అవ్వడానికి మెగాస్టార్ అయ్యుండొచ్చు.. కాని ఈ మోడ్రన్ సోషల్ మీడియా యుగంలో ఇంకా చిరంజీవి తాను నెం.1 హీరోయే అని నిరూపించుకోగలరా? బాక్సాఫీస్ పై తన ప్రభావం చూపించగలరా? పాలిటిక్స్ ఆయనపై అద్దిన మచ్చలను తుడిచేసుకుని.. తన క్రేజ్ అనేది చెరిగిపోలేదు.. ఇంకిపోలేదు.. ఆవిరైపోలేదు అని ప్రూవ్ చేసుకుంటారా? ఇలాంటి కొన్ని సందేహాల నడుమ ఖైదీ నెం 150వ సినిమా జనవరి 11న రావడానికి సిద్దపడింది. అసలు ఈ కంబ్యాక్ పట్ల జనాల ఆసక్తి ఎలా ఉందో చూద్దాం పదండి.

అది కూకటపల్లి నుండి హైదర్ నగర్ వెళ్ళే దారిలో భ్రమరాంభ-మల్లిఖార్జున ధియేటర్. చాలా పెద్ద పెద్ద సినిమాలకు అక్కడ బెనిఫిట్ షోలు వేస్తుంటారు. ఆ మధ్యన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను అర్ధరాత్రి 12 గంటలకు బెనిఫిట్ షో వేసేశారు. ఇక ఈరోజు కరక్టుగా 12 గంటలకు అక్కడ చూస్తే.. ఉన్నవి రెండు ధియేటర్లు కాని.. నాలుగు ధియేటర్ల జనాలు. 20 ఏళ్ళ వయస్సులో ఉన్న పిల్లలు వందల్లో వచ్చారు. బాస్ సినిమా ఎన్నింటికి పడుతుంది అని అడుగుతూ.. అసలు ఇంకా టిక్కెట్లు ఇవ్వలేదేంటి.. అమ్మట్లేదేంటి.. అంటూ చేతిలో ఉన్న 2 వేల రూపాయల నోటును ఫ్లాషింగ్ చేస్తూ.. హడావుడి చేశారు. ఇంతలో పోలీసులు వచ్చి షో లేదు అని పంపేసినా కూడా.. ఓ అరగంటలో అందరూ మళ్లీ గుమిగూడారు. ఇక ఉదయం 4 గంటల కావొస్తున్న సమయంలో ధియేటర్ల గేట్లు తెరిచారు. 4.30కు మొదటి ఖైదీ నెం 150 షో పడింది. అక్కడ నుండి ధియేటర్లో మారుమ్రోగిన అరుపులు.. చప్పట్లు.. వీలలు.. ఎగురుతున్న పేపర్ ముక్కలు.. కట్టలు తెంచుకున్న అభిమానం.. మితిమీరిన ఉల్లాసం.. నభూతో నభవిష్యత్.

అక్కడ తెర మీద మెరుస్తోంది వీరందరూ ఈ మద్య కాలంలో చూసిన హీరో కాదు. అలాగే ఈ కుర్రాళ్ళు వయస్సులో ఉండగా చూసిన హీరో కూడా కానే కాదు. నిన్నటి మొన్నటివరకు కేవలం ఇతర మెగా హీరోల ఫంక్షన్లలో స్టేజీలపై మాత్రమే కనిపించి తన మాటలతో అలరించిన ఒక మెగాస్టార్.. నిజంగానే అసలు మెగాస్టార్ అనే పదానికి అర్ధం ఏంటి.. పరమార్ధం ఏంటి అనేది ఈ యంగ్ ఫ్యాన్స్ చూపించిన ఇంట్రెస్ట్ ద్వారా తెలియజెప్పారు. ఇది కేవలం ఒక ధియేటర్ కథ. ఇలా తెలుగు రాష్ట్రంలలో తొలి ప్రీమియర్ షో వేసిన ఏలూరు నగరంలోని ధియేటర్లు కాని.. అలాగే కువైట్లో దంగల్ సెకండ్ షో లు క్యాన్సిల్ చేసి ఖైదీ నెం 150కే టోటల్ స్ర్కీన్లు అంకితం చేయడం కాని.. ఓవర్సీస్ లో 1 మిలియన్ పైగా ప్రీమియర్ వసూళ్ళు రావడం.. జస్ట్ కొన్ని మెగా ఎగ్జాంపుల్స్ అంతే.

ఇప్పటివరకు ఇండియాలో ఏ సూపర్ స్టార్ కూడా ఈ రేంజులో కంబ్యాక్ క్రేజ్ చవిచూడలేదు. అది కేవలం మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే సాధ్యపడింది. #BossIsBack అంటే అప్పట్లో కొన్ని కామెడీ పంచ్ లు వినిపించినప్పటికీ.. ఇప్పుడు అందరూ బాస్ ఈజ్ బ్యాక్ అంటే ఇదా అర్దం అంటూ నోళ్ళు వెళ్ళబెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. 61 ఏళ్ల వయస్సులో కూడా టాలీవుడ్ ను ఇలా షేక్ చేస్తున్న చిరంజీవిని చూస్తుంటే.. వావ్ అనకుండా ఉండలేం. ఈ మెగా ప్రభంజనానికి స్వాగతం చెప్పకుండా ఆపుకోలేం. బాస్ ఈజ్ ట్రూలీ బ్యాక్. శభాష్‌ చిరు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/