అజ్ఞాతవాసి కోసం అన్నయ్య వస్తున్నాడు

Tue Dec 12 2017 14:35:52 GMT+0530 (IST)

మెగా హీరోల మెగా ప్రాజెక్టుల కోసం మెగా హీరోలే చీఫ్ గెస్టులుగా రావడం మనం ముందునుండి చూస్తున్న విషయమే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా ''అజ్ఞాతవాసి'' ఆడియో ఫంక్షన్ కోసం ఎవరు గెస్టుగా వస్తారనే ప్రశ్న చాలామంది మదిని తొలిచేస్తోంది. ఇకపోతే ఈ సినిమా ఆడియో డేట్ ఎప్పుడూ అంటూ కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు.తాజా అప్డేట్ ఏంటంటే.. డిసెంబర్ 19న త్రివిక్రమ్ డైరక్షన్లో రూపొందిన పవన్ 25వ సినిమా అజ్ఞాతవాసి తాలూకు ఆడియోను హైదారాబాద్ లోని హైటెక్స్ ఆడిటోరియంలో రిలీజ్ చేయనున్నారట. ఈ కార్యక్రమంలో మరెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా చీఫ్ గెస్టుగా తన తమ్ముడి కోసం రానున్నారని తెలుస్తోంది. ఆ మధ్యన 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా కోసం ఆడియో లాంచ్ నాడు అన్నయ్యను పిలిచి తన భక్తిని చాటుకున్న పవన్.. తను మాత్రం ఖైదీ నెం 150 తాలూకు ఫంక్షన్ కు వెళ్ళనేలేదు. అయితే ఇప్పుడు అజ్ఞాతవాసి సినిమా తన ఆఖరి సినిమా అని చెప్పడంతో.. మరోసారి చిరంజీవి వస్తున్నారనగానే సర్వత్రా ఆసక్తి నెలకొంది.

చాలాసార్లు అన్నయ్య ఈ తమ్ముడిపై ప్రేమను కురిపిస్తూనే.. సినిమాలను మానొద్దంటూ చెప్పారు. మరి ఇప్పుడు కూడా అజ్ఞాతవాసి ఆడియో లాంచ్ లో ఆయన తన తమ్ముడికి అదే హితోపదేశం చేస్తారా? పైగా ఇప్పుడు తమ్ముడు ప్రజారాజ్యం అదీ ఇదీ అంటూ పొలిటికల్ స్పీచుల్లో అన్నయ్య గురించి తెగ ప్రస్తావిస్తున్న వేళ.. అసలు ఈ కార్యక్రమంలో వీరిరువురూ ఏం మాట్లాడతారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది.