ఖైదీ షో వేయలేదని థియేటర్ మీద దాడి

Wed Jan 11 2017 11:52:14 GMT+0530 (IST)

మెగా అభిమానులు ఎంతో అభిమానంతో ఎదురుచూస్తున్న ఖైదీ నంబరు 150 విడుదల సందర్భంగా కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సినిమాకు బెనిఫిట్ షో వేస్తారన్న ప్రచారం చాలాచోట్ల జరిగింది. ఇలానే గుంటూరు జిల్లా కొల్లూరులోని శ్రీనివాస థియేటర్ లో మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత బెనిఫిట్ షో వేస్తారన్న ప్రచారం జరిగింది.

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చేసినట్లు చెబుతున్నారు. ఈ ప్రచారంతో అభిమానులు థియేటర్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. రాత్రంతా జనమంతా థియేటర్ వద్దే ఉండిపోయారు. ఏ క్షణంలో అయినా సినిమా వేస్తారని ఎంతగానో ఆశించారు. అయితే.. గురువారం తెల్లవారుజామున కూడా సినిమా వేయకపోవటంపై అక్కడి మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫ్యాన్స్ కోపాన్ని అంచనా వేయటంలో థియేటర్ సిబ్బంది ఫెయిల్ కావటం.. పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులకు అసంతృప్తి హద్దులు దాటకుండా ఏదైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. కానీ.. అలాంటిదేమీ తీసుకోకపోవటం.. అసహనం హద్దులు దాటి.. థియేటర్లోకి బలవంతంగా చొచ్చుకెళ్లారు. అనంతరంలో థియేటర్ లోపల తెరను చించేసి.. కుర్చీలు ధ్వంసం చేసి నానారచ్చ చేశారు. థియేటర్ సిబ్బంది నిర్లక్ష్యమే అభిమానుల ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు. ఊహించని ఈ పరిణామంతో థియేటర్ యాజమాన్యం అవాక్కు అయినట్లుచెబుతున్నారు. థియేటర్ దగ్గరజరుగుతున్న రచ్చపై సమాచారం అందుకు పోలీసులు.. మెగా అభిమానుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/