Begin typing your search above and press return to search.

సీనియర్ స్టార్స్: స్టిల్ మెగాస్టార్ రూల్స్

By:  Tupaki Desk   |   13 Sep 2019 2:30 PM GMT
సీనియర్ స్టార్స్: స్టిల్ మెగాస్టార్ రూల్స్
X
ఇప్పుడంటే సీనియర్ స్టార్ల హవా తగ్గి (పవన్ కళ్యాణ్).. మహేష్ బాబు..ఎన్టీఆర్.. చరణ్.. ప్రభాస్.. అల్లు అర్జున్ ల హవా నడుస్తోంది కానీ గతంలో ఆ నలుగురు సీనియర్ స్టార్లదే రాజ్యం. చిరంజీవి.. బాలకృష్ణ.. నాగార్జున.. వెంకటేష్ టాలీవుడ్ కు నాలుగు పిల్లర్లలాగా ఉండేవారు. సినిమా ఓపెనింగ్స్ లో కానీ.. కలెక్షన్ రికార్డులలో కానీ వారిని దాటి పోవడం మిగతా హీరోలకు దాదాపుగా సాధ్యమయ్యేది కాదు. బాక్స్ ఆఫీస్ రికార్డుల విషయానికి వస్తే చిరు బాలయ్యల మధ్యలో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉండేది. అయితే ఎక్కువ శాతం చిరు డామినేషన్ కనిపించేది.

అయితే అదంతా ఓ పదిహేనేళ్ళ క్రితం సంగతి. ఇప్పుడు సీనియర స్టార్ల బాక్స్ ఆఫీస్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. చిరంజీవి దాదాపు పదేళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న తర్వాత 'ఖైది నెం. 150' తో రీ ఎంట్రీ ఇచ్చి భారీ విజయం సాధించారు. ఆ సమయంలో 100 కోట్ల షేర్ మార్కును దాటడమే కాకుండా నాన్ బాహుబలి రికార్డు సృష్టించారు. ఇక మిగతా సీనియర్ స్టార్ల సంగతి చూస్తే బాలయ్య అడపాదడపా విజయం సాధిస్తున్నా మెజారిటీ సినిమాలు మాత్రం నిరాశపరుస్తున్నాయి. అయితే ఆయన కూడా 'గౌతమీపుత్ర శాతకర్ణి' తో మొదటి సారి యాభై కోట్ల మార్క్ కలెక్షన్స్ దాటి తన సత్తా చాటారు. కానీ మళ్ళీ ఇప్పటివరకూ ఆయన సినిమాలేవీ యాభై కోట్ల మార్క్ ను దాటలేకుండా ఉన్నాయి.

ఇక నాగార్జున వరస పరాజయాలతో సతమతమవుతున్నారు. 'సోగ్గాడే చిన్ని నాయనా' తర్వాత ఇప్పటి వరకూ ఆయనకు సాలిడ్ హిట్ దక్కలేదు. నాగ్ మార్కెట్ రోజురోజుకీ తీసికట్టు అన్నట్టుగా మారుతోంది. మరో సీనియర్ స్టార్ వెంకీ కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు కానీ ఈ ఏడాది 'F2' మూవీతో ఆయన ఫుల్ గా ఫాంలోకి వచ్చారు. భారీ కలెక్షన్స్ తో తన స్టామినాను ప్రూవ్ మరోసారి చేసుకున్నారు. అయితే ఇది మల్టిస్టారర్ ఫిలిం కావడంతో ఆయన సోలో రికార్డుగా పరిగణించలేం.

ఇక బాక్స్ ఆఫీస్ స్టామినా గురించి మాట్లాడుకుంటే మాత్రం చిరు ఇప్పటికీ మిగతా సీనియర్ స్టార్లకు అందనంత ఎత్తులో ఉన్నారు. మిగతా స్టార్ల సినిమాలకు యాభై కోట్ల బడ్జెట్ పెట్టాలంటే నిర్మాతలు ముందు వెనక ఆలోచిస్తారేమో కానీ చిరు సినిమాకు ఇప్పటికీ 100-150 కోట్లు పెట్టే నిర్మాతలు రెడీగా ఉన్నారు. బడ్జెట్ విషయంలో కానీ.. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కానీ చిరుకు ఇతర సీనియర్ స్టార్లు దరిదాపుల్లో లేరు. మిగతా సీనియర్ స్టార్లకు చిరుకు ప్రస్తుతం కనిపిస్తున్న తేడా ఏంటంటే.. చిరు ఏకంగా ఈ జెనరేషన్ టాప్ లీగ్ స్టార్లతో పోటీ పడుతూ సత్తా చాటుతున్నారు. చిరు ప్రస్తుతం నటిస్తున్న 'సైరా' దానికి ఉదాహరణ. ఆ సినిమాకు ఫలితం ఎలా ఉంటుందో ఏమో కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం షాక్ ఇస్తోంది.

దశాబ్దం పాటు సినిమాలకు దూరంగా ఉన్నా మళ్ళీ 'బాస్ ఈజ్ బ్యాక్' అన్నటుగా గ్రాండ్ రీ-ఎంట్రీ ఇవ్వడం. ఇప్పుడు మళ్ళీ 'సైరా'తో భారీ ప్లాన్స్ తో ముందుకు రావడం చూస్తే అయనను మెగాస్టార్ అని ప్రేక్షకులు ఎందుకు పిలుస్తారనే దానికి మనకు సమాధానం దొరుకుతుంది.