Begin typing your search above and press return to search.

శ్రీజ-కళ్యాణ్ పెళ్లి వీడియో వచ్చేసింది

By:  Tupaki Desk   |   30 March 2016 9:57 AM GMT





తన చిన్న కూతురు శ్రీజ పెళ్లి విషయంలో మెగాస్టార్ చిరంజీవి గోప్యత పాటించకుండా అన్ని విశేషాలూ మీడియాతో పంచుకుంటుండటం విశేషమే. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన చాలా ఫోటోల్ని మీడియాకు రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచిన మెగా ఫ్యామిలీ తాజాగా.. పెళ్లి వేడుకకు వీడియోను షార్ట్ చేసి ట్రైలర్ తరహాలో మీడియాకు అందించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

బెంగళూరులోని తన ఫామ్ హౌజ్ లో చాలా ఆహ్లాదకర వాతావరణంలో కుటుంబ సభ్యులు.. కొద్ది మంది సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా ఈ వివాహం జరిపించాడు చిరంజీవి. సీతా కళ్యాణ వైభోగమే అంటూ.. ఈ వీడియో కోసం ప్రత్యేకంగా పాటను స్వరపరిచి.. బ్యాగ్రౌండ్లో ప్లే చేశారు. ముందు వివాహవేడుక జరిగిన ఫామ్ హౌజ్ ఔట్ లుక్ తో ఈ వీడియో మొదలవుతుంది. తర్వాత పెళ్లికొడుకును అల్లు అరవింద్ తదితరులు తీసుకొస్తున్న దృశ్యం కనిపిస్తుంది.

రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్ కలిసి శ్రీజకు గొడుగు పట్టి తీసుకొచ్చారు. ఆపై చిరంజీవి-సురేఖ కాళ్లు కడగడంతో పాటు ఇతర సంప్రదాయ వ్యవహారాలు పూర్తి చేస్తే.. వరప్రసాద్ రెడ్డి.. గంటా శ్రీనివాసరావు తదితరులు వధూవరుల్ని ఆశీర్వదించిన దృశ్యాలు కనిపించాయి. చరణ్-ఉపాసన వధూవరుల్ని ఆశీర్వదించాక.. చరణ్ తన చెల్లెలికి ముద్దు కూడా ఇచ్చాడు.

తర్వాత వరుణ్ తేజ్.. సాయిధరమ్ లతో పాటు మెగా కుటుంబ యూత్ అంతా ఓ చోట కూర్చుని పెళ్లి చూస్తున్న దృశ్యం కనిపించింది. సాయిధరమ్ లాల్చీలో చిత్రంగా కనిపించాడు. బెంగళూరు నుంచి చిరంజీవి స్నేహితురాలు.. ఒకప్పటి ఆయన హీరోయిన్ సుమలత కూడా వచ్చి వధూవరుల్ని ఆశీర్వదించింది. ఆపై అక్షింతలు, ఉంగరాల ఆట సాగాయి. అల్లు అర్జున్-స్నేహ జంట వీడియో చివర్లో దర్శనమిచ్చింది. వధూవరులతో కలిసి మెగా ఫ్యామిలీ దిగిన ఫొటోతో ఈ రెండున్నర నిమిషాల వీడియోకు తెరపడింది.