చిరు డ్యాన్సుల్లో ఒక స్పెషాలిటీ ఉంది

Wed Jan 11 2017 18:12:26 GMT+0530 (IST)

ఇండియన్ సినిమాలో ఎంతో మంది గ్రేట్ డ్యాన్సర్లు ఉన్నారు. కానీ వాళ్లందరిలో చిరంజీవి ప్రత్యేకంగా నిలుస్తారు. కష్టమైన స్టెప్ వేయడం.. వేగంగా డ్యాన్స్ చేయడం.. ఇవే డ్యాన్సింగ్ టాలెంట్ కు కొలమానాలు కావని రుజువు చేసిన హీరో మెగాస్టార్. ఆయన డ్యాన్స్ లో ఒక స్టయిల్ ఉంటుంది. ఒక రిథమ్ ఉంటుంది. ఒక గ్రేస్ ఉంటుంది. ఈ ప్రత్యేకతలే ఆయన్ని ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలబెట్టాయి. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే గ్రేటెస్ట్ డ్యాన్సర్లలో ఒకడిగా పేరు తెచ్చిపెట్టాయి. ఐతే చిరంజీవి సినిమాల నుంచి నిష్క్రమించాక డ్యాన్సుల తీరు మారింది. చాలామంది యంగ్ హీరోలు డ్యాన్సుల్లో బాగా పండిపోయారు. ఎవరికి వారే సాటి అని నిరూపించారు. యువ కథానాయకుల వేగం చూసి వారెవా అనుకున్నారు తెలుగు ప్రేక్షకులు.

ఐతే ఇప్పుడు చిరు వచ్చి వాళ్లను మరిపించగలడా అని సందేహం వ్యక్తం చేశారు. కానీ చిరు తనదైన శైలిలో ఈ సందేహాలకు బదులిచ్చారు. ‘ఖైదీ నెంబర్ 150’లో చిరు డ్యాన్సుల్లో చాలా ప్రత్యేకత కనిపిస్తాయి. చాలామంది చిరు చాలా కష్టమైన స్టెప్పులు ట్రై చేస్తాడని.. చాలా స్పీడ్ చూపిస్తాడని అనుకున్నారు. ఈ అంచనాలతోనే ‘ఖైదీ నెంబర్ 150’ చూస్తే ఒకింత నిరాశ తప్పదేమో. వేగం గురించి పట్టించుకోకుండా.. మరీ కఠినమైన స్టెప్పులేమీ ట్రై చేయకుండా సింపుల్ గా ఉంటూ.. చాలా స్టైలిష్ గా.. చూస్తూనే ఉండాలనిపించేలా చిరు డ్యాన్సులు సాగాయి. ఒక పాట షూ లేస్ ఊడిపోతే దాన్ని కట్టుకుంటూ పక్కకు జరుగుతూ వెళ్లే స్టెప్ ఒకటుంటుంది. ఆ స్టెప్ చూస్తే చిరు ముందు యువ కథానాయకులు కూడా దిగదుడుపే అనిపిస్తుంది. మరీ కఠినమైన స్టెప్పుల కోసం ప్రయాస పడకుండా రిథమ్ చూపిస్తూ.. స్టయిల్ చూపిస్తూ డ్యాన్సుల్ని రక్తి కట్టించాడు చిరు. ఒకప్పటితో పోలిస్తే చిరులో కొంచెం వేగం తగ్గినట్లు అనిపించొచ్చు కానీ.. ఆయన డ్యాన్సుల్లో అందం మాత్రం తగ్గలేదని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/