`ఇంద్ర` ఫేం.. బాలనటుడు తేజ హీరోగా..

Tue Jun 25 2019 16:58:58 GMT+0530 (IST)

బాలనటులు హీరోలుగా రాణించిన సందర్భాలున్నాయి. తరుణ్.. బాలాదిత్య .. తనీష్.. మనోజ్ నందం.. ఆకాష్ పూరి బాలనటులుగా రాణించి హీరోలు అయ్యారు. అదే బాటలో ఇంద్ర ఫేం బాలనటుడు తేజ హీరో అవుతున్నారు. ఇప్పటికే అగ్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ లో హీరోగా ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.బాలనటుడిగా ఎంతో ప్రతిభను చాటిన మాస్టర్ తేజ సజ్జా మెగాస్టార్ చిరంజీవి నటించిన చూడాలని ఉంది .. ఇంద్ర చిత్రాల్లో నటించారు. ఇంద్రలో యువ ఇంద్ర సేనా రెడ్డిగా అద్భుత ఆహార్యంతో ఆకట్టుకున్నాడు. అలాగే మహేష్ నటించిన యువరాజు.. జగపతిబాబు బాచి చిత్రాల్లోనూ బాలనటుడిగా చెప్పుకోదగ్గ పాత్రల్లో నటించారు. దాదాపు  యాభై సినిమాల వరకూ నటించిన మాస్టర్ తేజ ఇప్పుడు మిస్టర్ తేజ అయ్యారు.

అతడు నటించిన ఓ బేబి త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో సమంతకు మనవడి పాత్రలో తేజ కనిపించబోతున్నాడు. తాజాగా రిలీజైన ట్రైలర్ లో తేజ లుక్ ఆకట్టుకుంది. మంచి ఈజ్ ఉన్న నటుడిగా మైమరిపించాడు. తేజను చూసిన వారంతా ఇతడేనా చిన్ననాటి ఇంద్ర అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై వరుసగా హీరోగా సినిమాలు చేసే ఆలోచనలో ఉన్న తేజ తొలిగా సురేష్ ప్రొడక్షన్స్ సినిమాకి కమిటయ్యాడు. దాంతో పాటే వేరొక సినిమాలోనూ నటిస్తున్నాడు. అలాగే వేరొక ప్రముఖ బ్యానర్ లో యువదర్శకుడి నిర్ధేశనంలో నటించనున్నాడు. బాలనటుడిగా మెప్పించిన తేజ లుక్ వైజ్ ఆకట్టుకున్నాడు. హీరోగా అతడి నటన ఎలా ఉండబోతోంది? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. కాస్త వేచి చూడాలి.