Begin typing your search above and press return to search.

చిన్నప్పటి చిరంజీవి హీరో అవుతున్నాడు

By:  Tupaki Desk   |   21 Aug 2017 7:37 AM GMT
చిన్నప్పటి చిరంజీవి హీరో అవుతున్నాడు
X
మెగాస్టార్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ ‘ఇంద్ర’లో చిన్నప్పటి చిరంజీవిగా నటించిన బుడ్డోడు గుర్తున్నాడా? ఆ పిల్లాడు తొడగొడితే మెరుపులు మెరిసే సన్నివేశాన్ని తెలుగు ప్రేక్షకులు అంత సులువగా మరిచిపోలేరు. ‘ఇంద్ర’ తర్వాత యువరాజు.. ఠాగూర్.. సాంబ.. బాచి.. లాంటి మరెన్నో సినిమాల్లో ఈ పిల్లాడు బాల నటుడిగా నటించాడు. చైల్డ్ ఆర్టిస్టుగానే అతను అర్ధసెంచరీ పూర్తి చేయడం విశేషం.

కొంచెం వయసు పెరిగాక సినిమాలు వదిలేసి చదువు మీద దృష్టి పెట్టిన ఈ పిల్లాడు.. ఇప్పుడు పెద్దోడయ్యాడు. అతను త్వరలోనే హీరోగా పరిచయం కాబోతున్నాడు. ‘మేం వయసుకు వచ్చాం’.. ‘సినిమా చూపిస్త మావ’.. ‘నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్’ లాంటి సినిమాలు నిర్మించిన బెక్కెం వేణుగోపాల్ తన సంస్థ ద్వారా తేజను హీరోగా పరిచయం చేస్తున్నాడు.

హరి అనే కొత్త దర్శకుడు హీరోగా తేజు డెబ్యూ మూవీని రూపొందించబోతున్నాడు. ‘ఉయ్యాల జంపాల’.. ‘స్వామి రారా’.. ‘రౌడీ ఫెలో’ లాంటి సినిమాలతో సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన సన్నీ ఎం.ఆర్ ఈ చిత్రానికి సంగీతాన్నందించనున్నాడు. హీరో అయ్యే ముందే తేజ కొన్ని ఫొటో షూట్లు చేశాడు. అందులో కుర్రాడు బాగానే కనిపిస్తున్నాడు. తరుణ్.. బాలాదిత్య.. తనీష్ లాంటి చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు టాలీవుడ్లో హీరోలుగా మారారు కానీ.. లాంగ్ కెరీర్ ఎవరికీ లేకపోయింది. మరి తేజ ఎలా నిలదొక్కుకుంటాడో చూడాలి.