దర్శకుడికి న్యాయమూర్తి చివాట్లు

Tue Jun 25 2019 11:26:37 GMT+0530 (IST)

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కబాలి మరియు కాలా వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన దర్శకుడు రంజిత్ పా గత కొన్ని రోజులుగా వివాదాస్పద అంశాలతో మీడియాలో ఉంటున్న విషయం తెల్సిందే. ఆమద్య మహిళ సాధికారత విషయమై మాట్లాడి మీడియాలో ప్రముఖంగా కనిపించిన దర్శకుడు రంజిత్ ఇటీవల తమిళులు ఆరాధించే రాజ రాజ చోళన్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.రాజ రాజ చోళన్ ఎంతో మంది దళితుల జీవితాలను నాశనం చేశాడంటూ రంజిత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంను రేపాయి. పలు హిందూ సంఘాల వారు ఆయనపై కేసులు పెట్టారు. హిందూ వ్యతిరేకి అంటూ దర్శకుడిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఇదే సమయంలో రంజిత్ పై కేసు కూడా నమోదు అయ్యింది. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో దర్శకుడు రంజిత్ పా పై కేసు కూడా నమోదు అవ్వడంతో.. అరెస్ట్ కు రంగం సిద్దం అయ్యింది.

ముందస్తు బెయిల్ కోసం పా రంజిత్ పిటీషన్ దాఖలు చేసుకోగా మొదట కొట్టి వేయడం జరిగింది. తాజాగా మరోసారి దర్శకుడు ముందస్తు బెయిల్ పిటీషన్ ను పెట్టుకున్నాడు. అయితే పా రంజిత్ పై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దర్శకుడి బెయిల్ పిటీషన్ ను పరిశీలించిన న్యాయమూర్తి స్పందిస్తూ భావస్వేచ్చ ఉంది కదా అంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడవచ్చా.. భావ స్వేచ్చకు హద్దులు ఉండవా అంటూ ప్రశ్నించాడట. ఈ కేసు విషయంలో ఇంకా రంజిత్ పా కు బెయిల్ దక్కలేదు. వచ్చే నెల 6వ తేదీన మరోసారి ఈ కేసును విచారించబోతున్నారు.