Begin typing your search above and press return to search.

మహానటి సత్యం నిజంగా ఉన్నాడా?

By:  Tupaki Desk   |   17 May 2018 1:24 PM GMT
మహానటి సత్యం నిజంగా ఉన్నాడా?
X
మహానటి సినిమాలో అందరి దృష్టి సావిత్రి-జెమిని గణేషన్ పాత్రలు పోషించిన కీర్తి సురేష్ దుల్కర్ సల్మాన్ మీదే ఉన్నప్పటికీ ఆవిడ జీవితంలో అంతగా మోసపోవడానికి కారణమైన పాత్రలో కనిపించిన శతమానం భవతి మహేష్ కూడా అందరికి బాగా రిజిస్టర్ అయ్యాడు. రంగస్థలంలో చరణ్ అసిస్టెంట్ గా మంచి మార్కులు కొట్టేసిన మహేష్ ఆ స్థాయిలో కాకున్నా సెకండ్ హాఫ్ లో కాస్త చెప్పుకోదగ్గ పాత్రే చేసాడు. సావిత్రిగారితో చెక్ రాయించుకుని పారిపోయి ఆ తర్వాత లక్షాధికారి అయినట్టు ఒక షాట్ లో సత్యం అనబడే ఆ పాత్రను చూపించారు. ఇప్పుడా సత్యం నిజ జీవితంలో ఎక్కడ ఉన్నాడా అనే అనుమానం అందరికి కలిగింది. నిజానికి ఖచ్చితంగా సత్యం అనే పేరుతోనే అలా పిలవబడిన వ్యక్తి లేడట. అలాంటి వాళ్ళు సావిత్రి గారి జీవితంలో చాలా మంది ఉన్నారనే ఉద్దేశాన్ని చూపడం కోసమే నాగ అశ్విన్ సత్యంని సృష్టించాడు తప్ప నిజంగా లేడు అనేది సీనియర్ పాత్రికేయుల మాట.

ఇది నిజమో అబద్దమో చెప్పేందుకు సావిత్రి గారు అందుబాటులో లేరు కనక ఏది నిర్ధారణగా చెప్పలేం. కాని సత్యం లాంటి ఎందరి చేతిలోనో సావిత్రి గారు ఆర్థిక లావాదేవీల విషయంలో మోసగింపబడ్డారు అన్నది మాత్రం నిజం. చివరి దశలో తాను ఎంత దీన స్థితిలో ఉన్నా తనతో నటించిన అగ్ర హీరోలను యాచించే ఆలోచన కూడా చేయలేదు. అందుకే ఆవిడ ఎంత మద్యానికి బానిసైనా ఈ కారణంగానే సావిత్రిగారిని అభిమానించే వాళ్ళు ప్రేక్షకులు. ఒక్కడు కాదని అలాంటి సత్యంలు సావిత్రి గారి లైఫ్ లో పదుల సంఖ్యలో ఉన్నారని కొన్ని పుస్తకాల్లో ఉంది. కాకపోతే సినిమాలో సత్యం పరిచయం అయ్యే విధానం వెంటనే సావిత్రి గారు పనిలో పెట్టుకునే సీన్ కాస్త నాటకీయంగా వచ్చింది. లెంగ్త్ సమస్య వల్ల సావిత్రి గారి కారు డ్రైవర్-ఆవిడకు మేకప్ అసిస్టెంట్ గా ఉన్న ఒక మహిళ ఇలా చాలానే స్క్రిప్ట్ లో తీసేయాల్సి వచ్చిందట. ఒకవేళ వెబ్ సిరీస్ రూపంలో తీస్తే సావిత్రి గారి గురించి సంపూర్ణంగా చూపడానికి వందల ఎపిసోడ్ లు అవసరం అవుతాయేమో. ఆ ప్రయత్నం కూడా ఎవరైనా చేస్తే బాగుంటుంది. టాలీవుడ్ లో బయోపిక్ అనే ట్రెండ్ కు ఊపిరి ఊదిన నాగ అశ్విన్ ని స్పూర్తిగా తీసుకుని మరికొందరు దర్శక నిర్మాతలు అప్పుడే దివంగత నటీనటుల మీద రీసెర్చ్ కూడా మొదలు పెట్టేసారు