Begin typing your search above and press return to search.

మాణిక్యం మాటల మర్మమేంటో...?

By:  Tupaki Desk   |   8 May 2016 7:08 AM GMT
మాణిక్యం మాటల మర్మమేంటో...?
X
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ, వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్‌ రెడ్డి చేపడుతున్న మూడు రోజుల నిరహార దీక్షను స్వాగతిస్తున్నట్లు ఏపీ మంత్రి మాణిక్యాలరావు ప్రకటన చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ వ్యాఖ్యల వెనుక బీజేపీ జాతీయ నాయకత్వ ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని ఒకరికిద్దరు కేంద్ర మంత్రులు తేల్చిచెప్పిన తరువాత బీజేపీ నాయకత్వ తీరుపై టీడీపీ నేతలు ఘాటైన విమర్శలు సంధించిన విషయం తెలిసిందే.

హోదా ఇవ్వకపోతే కాంగ్రెస్‌ కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని గుంటూరు లోక్‌ సభ సభ్యుడు గల్లా జయదేవ్ పార్లమెంట్‌ లోనే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక ఎన్నికల ముందు ప్రత్యేకహోదా ఇస్తానని చెప్పిన బీజేపీ నాయకత్వం ఇప్పుడు మాట మార్చి ఏపీ ప్రజలను మోసం చేయాలని చూస్తోందని టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు - జూపూడి ప్రభాకర్‌ రావు - జలీల్‌ ఖాన్ వంటి వారు విమర్శించారు. నిధులు విషయంలోను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఒకవైపు ధీటుగా సమాధానమిస్తూనే, మరొకవైపు బీజేపీ నాయకత్వం - టీడీపీ నాయకత్వానికి షాకిచ్చే వ్యూహానికి పదునుపెట్టిందని రాజకీయపరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ క్రమంలో మాణిక్యాలరావు నర్మగర్భ హెచ్చరికలు చేసేలా ఈ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు.

మాణిక్యాల రావు వ్యాఖ్యల వెనుక బీజేపీ పెద్దలున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకహోదా అంశంలో తమని దోషిగా నిలబెట్టేందుకు టీడీపీ నాయకత్వం చేస్తోన్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు, జగన్ చేపట్టనున్న జలదీక్షకు మద్దతునిస్తున్నట్లుగా మంత్రి చేత వ్యాఖ్యలు చేయించారని అంటున్నారు. టీడీపీ తెగతెంపులు చేసుకునేందుకు తాము ఎప్పుడైన సిద్ధమేనన్న సంకేతాలను మాణిక్యాలరావు వ్యాఖ్యల ద్వారా ఆ పార్టీ నాయకత్వం పంపిందంటున్నారు.

ఆ కారణంగానే చంద్రబాబు ఒక్కసారిగా అప్రమత్తమై సీనియర్లతో సమాలోచనలు చేసి, బీజేపీ నాయకత్వంపై ఘాటైన విమర్శలు చేయరాదని పార్టీ నేతలను ఆదేశించారని చెబుతున్నారు. బీజేపీతో ఇప్పటికిప్పుడు తెగతెంపులు చేసుకోవడం వల్ల తమకే నష్టమని భావించిన చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. రాష్ట్ర విభజన అనంతరం తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీని ఆదుకోవాల్సిన కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆగ్రహంతో రగిలిపోతున్న చంద్రబాబు, అనివార్య పరిస్థితుల్లో బీజేపీతో 2019 చివరి వరకు మైత్రి కొనసాగించాలని బాబు భావిస్తున్నారంటున్నారు. అయితే బీజేపీ నాయకత్వం మాత్రం టీడీపీ తెగతెంపులు చేసుకోవడానికైనా రెడీ అన్నట్లుగా ఉందని తెలుస్తోంది. టీడీపీ కనుక తమను వదిలేస్తే వైసీపీతో జతకట్టడానికి సిద్ధమేనని తెలుస్తోంది. వైసీపీకి ఆ అవకాశం ఇవ్వకూడదనే చంద్రబాబు బీజేపీతో బలవంతపు పొత్తు కొనసాగిస్తున్నారని వినిపిస్తోంది.