‘ఎన్టీఆర్’ను చూసిన బాబు ఏమన్నాడంటే..!

Fri Jan 11 2019 23:35:07 GMT+0530 (IST)

భారీ అంచనాల నడుమ రూపొందిన ‘ఎన్టీఆర్’ చిత్రం మొదటి పార్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందమూరి ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఈ చిత్రంపై భారీ అంచనాలు పెంచుకుని ఎదురు చూశారు. విడుదల తర్వాత ఈ చిత్రంకు మిశ్రమ స్పందన దక్కింది. అయితే ప్రముఖుల నుండి సెలబ్రెటీల నుండి మాత్రం ఈ సినిమాకు ప్రశంజల జల్లు కురుస్తోంది. తాజాగా ఎన్టీఆర్ చిత్రాన్ని చూసిన చంద్రబాబు నాయుడు కూడా సినిమాపై చిత్ర యూనిట్ సభ్యులపై ప్రశంసలు కురిపించాడు.విజయవాడలో దర్శకుడు క్రిష్ బాలకృష్ణ మరియు తెలుగు దేశం పార్టీ నాయకులతో కలిసి చంద్రబాబు నాయుడు ‘ఎన్టీఆర్’ చిత్రాన్ని చూశారు. సినిమా చూసిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జీవితం ఒక చరిత్ర ఆ చరిత్రను తిరగరాసేలా బాలకృష్ణ ఈ చిత్రాన్ని చేశారు. తెలుగు జాతి గర్వించదగ్గ ఎన్టీఆర్ సినిమాను తెలుగు జాతి మొత్తం చూడాలి. సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం చేసుకునే ఒక సాదారణ వ్యక్తి అసాదారణ వ్యక్తిగా ఎలా అయ్యాడో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.

సినిమా చూస్తుంటే నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి. ఆయన ప్రతి విషయంలో కూడా ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేసేవారు. చిన్నప్పటి నుండి కూడా ఆత్మగౌరవంతో ముందుకు సాగిన ఎన్టీఆర్ గారు అందరికి ఆదర్శనీయుడు. తన పాత్రలో నటించిన రానా గురించి చంద్రబాబు నాయుడును స్పందించాల్సిందిగా మీడియా వారు కోరగా.. రానా పాత్ర గురించి నా కంటే మీరే ఎక్కువగా విశ్లేషించగలరన్నాడు.

సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా బాగా నటించారు. ప్రతి పాత్రలో కనిపించిన వారు ఆ పాత్రకు బాగా సూట్ అయ్యేలా క్రిష్ చేశాడు. పాత్రకు నటీ నటుల ఎంపిక మరియు వారి మేకప్ విషయంలో క్రిష్ ను చంద్రబాబు అభినందించారు. మా అత్తగారు జీవించి ఉన్న సమయంలో జరిగిన కథతో ఈ చిత్రాన్ని రూపొందిచారన్నారు. మహానాయుడు కూడా ఇలాగే ఎన్టీఆర్ నుండి స్ఫూర్తి పొందే విధంగా ఉంటుందని తాను ఆశిస్తున్నట్లుగా చంద్రబాబు అన్నారు.