చైతూ రేంజే మారిపోతుందంటున్న చందూ

Wed May 16 2018 17:29:07 GMT+0530 (IST)

‘కార్తికేయ’ లాంటి వైవిధ్యమైన సినిమాతో దర్శకుడిగా పరిచయమై ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు చందూ మొండేటి. ఈ తరం విలక్షణ దర్శకులకు అతను ప్రతినిధిగా కనిపించాడు అందులో చందూ. రెండో ప్రయత్నంలో ‘ప్రేమమ్’ లాంటి క్లాసిక్ ను రీమేక్ చేసే సవాలును అతను స్వీకరించాడు. ఎంతో నెగెటివిటీని తట్టుకుని కూడా ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేశాడు మరో విజయాన్ని అందుకున్నాడు.ఇప్పుడు మళ్లీ తనదైన శైలిలో ఓ వైవిధ్యమైన కథాంశంతో ‘సవ్యసాచి’ సినిమా చేస్తున్నాడు. తన రెండో సినిమా హీరో నాగచైతన్యనే ఇందులోనూ హీరోగా పెట్టుకున్నాడు. ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. తాను ‘ప్రేమమ్’ చేసే సమయానికి.. ఇప్పటికి చైతూలో చాలా మార్పు కనిపిస్తోందని.. నటుడిగా అతనెంతో ఎదిగాడని.. ‘సవ్యసాచి’తో అతను మరో రేంజికి వెళ్తాడని చందూ ధీమా వ్యక్తం చేశాడు.

‘‘కాలంతో పాటే ప్రతి ఒక్కరూ మెరుగవుతారు. చైతూ చాలా వేగంగా ఎదుగుతున్న సంగతి నేను చూస్తున్నా. తన నట కౌశలమేంటో ఈ సినిమాతో తెలుస్లుంది. నటుడిగా చైతూను ‘సవ్యసాచి’ మరో స్థాయికి తీసుకెళ్తుంది’’ అని ఓ ఇంగ్లిష్ డైలీతో మాట్లాడుతూ చందూ అన్నాడు. ఈ చిత్రంలో చైతూ ఒక చేయి తన అధీనంలో ఉండని కుర్రాడి పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో మాధవన్ విలన్ పాత్రలో కనిపించనుండటం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది