Begin typing your search above and press return to search.

రాజమౌళి-రామ్ చరణ్.. కొట్టిపారేయలేం

By:  Tupaki Desk   |   23 Aug 2017 4:07 AM GMT
రాజమౌళి-రామ్ చరణ్.. కొట్టిపారేయలేం
X
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘సై రా’ మోషన్ పోస్టర్ లాంచింగ్ కోసం రాజమౌళి రావడం.. రామ్ చరణ్ పక్కనే కూర్చుని ముచ్చట్లు చెప్పడం.. ఇద్దరూ ఒకే వేదిక మీద కనబడటం.. ఒకరి గురించి ఒకరు మాట్లాడటం.. ఇదంతా చూడగానే ‘మగధీర’ కాంబినేషన్ మళ్లీ చూడబోతున్నామన్న ప్రచారం మొదలైపోయింది. తన తర్వాతి సినిమా ఏదో ఇంకా తేల్చని సమయంలో ఓ పెద్ద దర్శకుడు.. ఇంకేదైనా సినిమాకు సంబంధించిన వేడుకకు హాజరయ్యాడంటే.. ఆ కాంబినేషన్ తెరమీదికి రాబోతుందన్న సంకేతాలు రావడం మామూలే. ఐతే రాజమౌళి విషయంలో ఇలా ఆలోచించడానికి వీల్లేదనే చెప్పాలి. ‘మగధీర’ చేయడం ద్వారా రాజమౌళికి మెగా ఫ్యామిలీతో అనుబంధం ఉండటం.. పైగా రాజమౌళి చేతుల మీదుగా మోషన్ పోస్టర్ లాంచ్ చేయిస్తే.. ‘సై రా’ను పాన్ ఇండియా మూవీగా మలచాలన్న ప్రయత్నానికి ఊతం లభిస్తుందని భావించడం వల్ల జక్కన్న ఈ కార్యక్రమానికి వచ్చి ఉండొచ్చు.

ఐతే ఈ ఫంక్షన్ కు ముడిపెట్టకుండా మామూలుగా చూస్తే.. రాజమౌళి-రామ్ చరణ్ కాంబినేషన్ రిపీటయ్యే అవకాశాల్ని పూర్తిగా అయితే కొట్టిపారేయలేం. ఎందుకంటే సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ పూర్తయ్యాక చరణ్ ఏం చేయాలో ఏమీ తేల్చుకోలేదు. ఎవరికీ కమిట్మెంట్ ఇవ్వలేదు. మరోవైపు రాజమౌళి కూడా తన తర్వాతి సినిమాకు హీరో విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. చరణ్ కాకుండా తెలుగులో ఏ స్టార్ హీరో కూడా అందుబాటులో లేడిప్పుడు. ఎన్టీఆర్.. ‘జై లవకుశ’ తర్వాత త్రివిక్రమ్.. కొరటాల శివలతో సినిమాలు చేయాల్సి ఉంది. ప్రభాస్ ‘సాహో’లో మునిగిపోయాడు. అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’తో పాటు లింగుస్వామి సినిమాను లైన్లో పెట్టాడు. మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్ కూడా వేరే కమిట్మెంట్లతో ఉన్నారు. మిగతా హీరోల పరిస్థితీ భిన్నంగా ఏమీ లేదు. ఐతే ఈ స్టార్లలో ఎవ్వరైనా సరే.. రాజమౌళి సినిమా చేస్తానంటే వేరే కమిట్మెంట్లను పక్కన పెట్టి మరీ ముందుకొస్తారనడంలో సందేహం లేదు. కానీ వాళ్లెవరినీ రాజమౌళి డిస్టర్బ్ చేయాలని అనుకోకపోవచ్చు. ఒకవేళ తాను ఓకే చేసిన కథకు చరణ్ సరిపోతాడనుకుంటే అతడితోనే సినిమా చేసే అవకాశాల్ని కొట్టిపారేయలేం. ఐతే హీరో ఎవరైనప్పటికీ రాజమౌళి ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్యకు చేయడం మాత్రం ఫిక్స్.