Begin typing your search above and press return to search.

చలపతిరావు మళ్లీ..

By:  Tupaki Desk   |   17 July 2017 8:27 AM GMT
చలపతిరావు మళ్లీ..
X
రెండు నెలల కిందట ఓ సినిమా ఆడియో వేడుకలో ‘‘అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారు’’ అంటూ కామెంట్ చేసి తీవ్ర విమర్శల పాలయ్యాడు సీనియర్ నటుడు చలపతిరావు. ఆ వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో తెలిసిన సంగతి తెలిసిందే. దీనిపై చలపతిరావు క్షమాపణలు చెప్పి లెంపలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ అనుభవంతో ఇకపై ఆయన జాగ్రత్తగా ఉంటాడని.. వివాదాస్పద అంశాలపై కామెంట్లు చేయడని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చలపతిరావు ఈ కాలం అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి మాట్లాడి వివాదంలో చిక్కుకున్నారు. ఇంతకీ ఆయనేమన్నారంటే..

‘‘అమ్మాయిలు ప్యాంటు టీషర్టు వేసుకెళ్లడం తప్పని నేను అనట్లా. కానీ ఆడపిల్లలకు వోణీ ఎందుకిస్తున్నాం. 13-14 ఏళ్లు వచ్చేసరికి పైన కవర్ చేసుకోవడానికి వోణీ ఇస్తున్నాం. కానీ ఆ వోణీని తలకేసుకుని.. నడుముకు చుట్టుకుని.. లేదా మెడకు వేసుకుని వెళ్లిపోతున్నారు. వోణీ పర్పస్ ఏంటన్నది తెలవట్లా ఆడపిల్లలకి. మనకు వోణీ ఎందుకిస్తున్నారో తెలియక తలకు చుట్టుకుని వెళ్లిపోతున్నారు. ఏం చెప్పాలి వాళ్లకి. కాలంతో పాటు మనం కూడా ఎంజాయ్ చేస్తాం. ఇది తప్పు అని చెప్పే రోజులు కూడా కావివి. చెబితే.. చాదస్తపరుడు.. ముసలోడు.. అంటారు. అందుకే మనకెందుకులే వాళ్ల కర్మ వాళ్లు పడతారు.. అనుభవించనీ అని వదిలేస్తున్నా. అలా వెళ్లినపుడు కుర్రాడు ఏదో అంటాడు. కామెంట్ చేస్తాడు. అన్నపుడు పడాలి. తప్పదు. ఓపిక ఉంటే పడాలి. లేదా దెబ్బలాడాలి. ఎంతమందితో ఆడతావు? దెబ్బలాడుతూ పోతే జీవితాంతం దెబ్బలాడాల్సిందే. పద్ధతైనా మార్చుకోవాలి. లేదా వాళ్లేమన్నా కూడా పడాలి’’ అని తీర్మానించారు చలపతిరావు.

మనది ప్రజాస్వామ్య దేశమని.. ఇక్కడ చీర కట్టుకుని వెళ్లినా ఏదో ఒక కామెంట్ చేస్తారని.. ఐతే మన జాగ్రత్తలో మనం ఉండటం అవసరమని.. అన్నారు. ముక్కుసూటిగా ఉండటంతో తనకు ఎన్టీఆర్ ఆదర్శమని.. ఆయన మాదిరే తాను ఉన్నదున్నట్లు మాట్లాడటం అలవాటు చేసుకున్నానని చలపతిరావుతెలిపారు. ఎన్టీఆర్ మరణం గురించి తెలిసిన విషయాలు చెప్పమంటే.. ‘‘ఆయన టైం అయిపోయింది కాబట్టి వెళ్లిపోయాడు’’ అంటూ ఒక్క ముక్కలో తేల్చేశారు చలపతిరావు.