Begin typing your search above and press return to search.

#ప‌ద్మావ‌తి: చ‌రిత్ర‌కారులతో సెన్సార్ చ‌ర్చ‌లు!

By:  Tupaki Desk   |   21 Nov 2017 1:10 PM GMT
#ప‌ద్మావ‌తి: చ‌రిత్ర‌కారులతో సెన్సార్ చ‌ర్చ‌లు!
X
ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంజ‌య్‌ లీలా భ‌న్సాలీ తెరకెక్కించిన 'ప‌ద్మావ‌తి' చిత్రంపై పెనుదుమారం రేగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాలో రాణి ప‌ద్మిని దేవి చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించి త‌మ మ‌నోభావాల‌ను దెబ్బ‌తీశార‌ని రాజ్ పుత్ క‌ర్ని సేన ఆరోపిస్తోంది. ఆ చిత్ర విడుద‌ల‌ను నిలిపివేయాల‌ని తీవ్ర స్థాయిలో డిమాండ్లు రావ‌డంతో ప‌ద్మావ‌తి విడుద‌ల‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామ‌ని ఆ చిత్ర నిర్మాణ సంస్థ వ‌యోకామ్ 18 సంస్థ ప్ర‌క‌టించింన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా విష‌యంలో సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ స‌ర్టిఫికేష‌న్ (సీబీఎఫ్ సీ) ఇవ్వ‌బోయే స‌ర్టిఫికెట్ చాలా కీల‌కం కానుంది. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమాను సెన్సార్ స‌భ్యులు చూడ‌క పోవ‌డం విశేషం. ఆ సినిమాను సెన్సార్ బోర్డు కొద్ది రోజుల క్రితం తిప్పి పంపింది. చిత్ర యూనిట్ పంపిన ద‌ర‌ఖాస్తు అసంపూర్ణంగా ఉండ‌డంతో సెన్సార్ బోర్డు ఆ ద‌ర‌ఖాస్తును స్వీక‌రించ‌లేదు.

తాజా వివాదాలు - విడుద‌ల వాయిదా నేప‌థ్యంలో సెన్సార్ బోర్డు కూడా స‌ర్టిఫికేష‌న్ విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది. ఆ సినిమాకు స‌ర్టిఫికెట్ ఇచ్చే విష‌యంలో చరిత్ర‌కారుల‌ను సంప్ర‌దించే యోచ‌న‌లో సెన్సార్ స‌భ్యులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. 'ప‌ద్మావ‌తి' సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లైన రాణి ప‌ద్మిని దేవి - ర‌త‌న్ సింగ్‌ - అల్లా ఉద్దీన్ ఖిల్జీల మ‌ధ్య ఉన్న సంబంధం గురించి చ‌రిత్ర‌కారుల‌ను సంప్ర‌దించాల‌ని వారు ప్లాన్ చేస్తున్నార‌ట‌. చ‌రిత్ర‌ను భ‌న్సాలీ త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని రాజ్‌ పుత్ సేన‌లు చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వ అవాస్త‌వాలు తెలుసుకున్న త‌ర్వాతే స‌ర్టిఫికెట్ జారీ చేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. సెన్సార్ స‌భ్యులు - చ‌రిత్ర కారుల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగి, అవి ఓ కొలిక్కి వ‌చ్చి స‌ర్టిఫికెట్ ఇచ్చేందుకు మ‌రికొంత స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో 2018 ఫిబ్ర‌వ‌రికి ఈ సినిమా విడుద‌ల వాయిదా ప‌డే అవ‌కాశ‌ముంద‌ని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా, ఈ చిత్ర వివాదానికి తెర‌దించే కీల‌క నిర్ణ‌యం సీబీఎఫ్‌ సీ - చ‌రిత్ర‌కారుల‌ చేతిలోనే ఉంద‌ని రాజ‌కీయ‌, సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మొత్తానికి ప‌ద్మావ‌తి భ‌విష్య‌త్తును చ‌రిత్ర‌కారులు - సెన్సార్ స‌భ్యులు నిర్దేశించ‌బోతున్నార‌ని భావిస్తున్నారు.