టాప్ స్టోరి: సౌత్ లవ్ బర్డ్స్

Thu Feb 14 2019 12:35:58 GMT+0530 (IST)

ప్రేమ అనేది అనిర్వచనీయమైన అనుభూతి. అది అనుభవించిన వారికి గొప్ప తీపి జ్ఞాపకం. నేడు ప్రేమికుల దినోత్సవం(ఫిబ్రవరి 14) సందర్భంగా ప్రేయసీ ప్రియుల మధ్య ఎమోషనల్ బాండింగ్ గురించి ప్రత్యేకింగా ప్రస్థావించాల్సి వస్తే... సౌత్ లో టాప్ స్టార్ల ప్రేమకథల్ని తరచి చూడాలి. ఆ తరహాలో చూస్తే టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ - నమ్రత ప్రేమకథ లో ఆసక్తికర మలుపుల గురించి తెలిసిందే. ఆ జంట అన్యోన్య దాంపత్యం - ప్రేమాప్యాయతల గురించి నిరంతరం అభిమానులు ముచ్చటించుకుంటారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - స్నేహారెడ్డి ప్రేమకథ.. దాంపత్యం గురించి ఫ్యాన్స్ లో నిరంతరం ఆసక్తిగా ముచ్చట సాగుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన చిన్న నాటి స్నేహితురాలు ఉపాసన కామినేనితో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఈ జోడీ పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య - సమంత ప్రేమకథ - అన్యోన్యత గురించి యువతరంలో చర్చ రెగ్యులర్. సూర్య - జ్యోతిక లవ్ స్టోరి - విఘ్నేష్ శివన్ - నయనతార ప్రేమకథ ప్రముఖంగా వినిపిస్తుంటాయి. అసలు ఈ జంటల మధ్య రియల్ లవ్ ఎప్పుడు మొదలైంది? అన్నది పరిశీలిస్తే ఆసక్తికరం.సూపర్ స్టార్ మహేష్ - నమ్రత మధ్య పరిచయం వంశీ (2005) అనే సినిమా టైమ్ లో మొదలైంది. ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్యా ఐదేళ్ల పాటు లవ్ స్టోరి రన్ అయ్యింది. అటుపై పెద్దల్ని ఒప్పించిన ఈ జంట పెళ్లి చేసుకుని ఇద్దరు చిన్నారులకు పేరెంట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంసారంలో అన్యోన్యతను ఆస్వాధిస్తున్నారు ఈ జోడీ. మహేష్- నమ్రత జంట వారసులు మాస్టర్ గౌతమ్ - బేబి సితార పెరిగి పెద్దవాళ్లు అవుతున్నారు. ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు  అర్జున్ - స్నేహారెడ్డి ప్రేమకథ - 2011లో పెళ్లి గురించి తెలిసిందే. ఈ జంటకు అయాన్ - అర్హ అనే ఇద్దరు క్యూట్ కిడ్స్ ఉన్నారు. బన్ని ఆల్వేస్ హ్యాపీ మ్యాన్. ఫ్యామిలీ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తమ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి జోయ్ ఫుల్ మూవ్ మెంట్ ని అల్లు అర్జున్- స్నేహ జంట సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన జంట 2012లో పెళ్లి చేసుకున్నారు. రచ్చ (2012) చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సమయంలోనే ఈ జంట ప్రేమకథ - పెళ్లి గురించి ప్రముఖంగా చర్చ సాగింది.

అక్కినేని నాగచైతన్య - సమంత జంట మధ్య పరిచయం.. అటుపై ప్రేమ.. పెళ్లి వ్యవహారం తెలిసిందే. ఏమాయ చేశావే (2010) సినిమాతో పరిచయం అటుపై ప్రేమగా మారింది. అయితే ఆ ప్రేమ పూర్తిగా పల్లవించి పెళ్లి చేసుకునేందుకు ఎక్కువ సమయమే పట్టింది. 2017లో ఈ జోడీ ఒకటయ్యారు. పెళ్లికి ముందు కలిసి మూడు సినిమాల్లో నటించారు. పెళ్లి తర్వాత `మజిలీ` అనే చిత్రంలో కలిసి నటిస్తున్నారు. బాలీవుడ్ లో అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యారాయ్ జంట తరహాలో కలిసి నటిస్తూ న్యూ గోల్స్ తో ఈ జంట సాగిపోతోంది. మరో సౌత్ టాప్ హీరో సూర్య - జ్యోతిక జంట ప్రేమకథ గురించి తెలిసిందే. ఈ జంట కోలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో కలిసి నటించే క్రమంలో ప్రేమ కథ సాగింది. అటుపై పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. అలాగే స్టార్ హీరో అజిత్ - షాలిని ప్రేమకథ గురించి తెలిసిందే. ఇటీవల స్టార్ హీరోయిన్ నయనతార - యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమ కథ గురించి - అన్యోన్యత గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆ ఇద్దరూ సహజీవనంలో ఉన్నారు. తొందర్లోనే ఈ జంట పెళ్లికి రెడీ అవుతున్నారన్న సమాచారం ఉంది. ఈ తరహా ప్రేమకథలు సౌత్ లో ఎన్నో. సినిమా 24 శాఖల్లోనూ ప్రేమకథలు పెళ్లిళ్ల వరకూ వెళ్లిన చరిత్ర చాలానే ఉంది.