మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా లేదా?

Tue Nov 20 2018 17:17:23 GMT+0530 (IST)

నందమూరి వంశంలో బాలయ్య తర్వాత అంత బలంగా ఇమేజ్ తో పాటు మార్కెట్ సాధించుకుంది ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. అప్పుడెప్పుడో ఎనభై దశకంలో వచ్చిన కల్యాణ చక్రవర్తితో మొదలుకుని ఒకేసారి తొమ్మిది సినిమాల షూటింగ్ లతో కెరీర్ ప్రారంభించిన తారకరత్న దాకా ఎవరు హీరోగా సక్సెస్ కాలేకపోయారు. బాలయ్య తరంలోనూ ఒక్క హరికృష్ణ మాత్రం కొంత వరకు రుజువు చేసుకున్నారు కానీ ఆయన ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. అందుకే బాలయ్య ఫ్యాన్స్ మోక్షజ్ఞ పరిచయం ఎప్పుడెప్పుడు ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఇప్పుడు అంటున్నారే తప్ప ఎప్పుడు వస్తాడు అనేది మాత్రం బాలయ్య కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ లో టీనేజ్ ఎన్టీఆర్ గా కానీ జూనియర్ బాలయ్యగా కాని లేక ఏదైనా ఒక కీలక పాత్ర ద్వారా కానీ లాంచ్ చేస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. షూటింగ్ ముందు క్రిష్ బాలయ్యలు కూడా ఇదే ఆలోచన చేశారట. తీరా ముప్పాతిక షూటింగ్ అయిపోయాక చెక్ చేసుకుంటే మోక్షజ్ఞ చేయాల్సిన పాత్ర ఏది లేదట. మరి ఫైనల్ గా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా లేదా అనే దాని గురించి స్పష్టత కొరవడుతోంది. గతంలో నిర్మాత ఇప్పటి ఎన్టీఆర్ నిర్మాణ భాగస్వామి సాయి కొర్రపాటి మోక్షజ్ఞను పరిచయం చేయాలన్న ఉద్దేశంతో రానే వచ్చాడు మా రామయ్య అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారు.

కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇంచుమించు అదే సమయంలో తారక్ రామయ్య వస్తావయ్యా వచ్చి డిజాస్టర్ అయ్యింది. టైటిల్ కాస్త దగ్గరగా ఉంది కాబట్టి అభిమానులు లైట్ తీసుకున్నారు. మరి ఎన్టీఆర్ బయోపిక్ లో వద్దు అనుకుంటే వేరుగా సోలో హీరోగా ఏదైనా సినిమా మొదలుపెడతారా అనే క్లారిటీ రావాల్సి ఉంది. గత ఏడాది ఈ ప్రస్తావన వచ్చినప్పుడు బాలకృష్ణ త్వరలోనే అని చెప్పారు కానీ ఇది జరిగిపోయి నెలలు దాటుతోంది. ఈ మధ్య మోక్షజ్ఞ బయట కూడా బొత్తిగా కనిపించడం మానేసాడు. శిక్షణలో ఉన్నాడని ఇన్ సైడ్ టాక్. ఏదేమైనా బాలయ్య ఫ్యాన్స్ ఇంకొంత కాలం ఎదురు చూడక తప్పదు